- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్
కొమురంభీం జిల్లా: సిర్పూర్ కాగజ్ నగర్ బీజేపీ నాయకులు పాల్వాయి హరీష్ బాబు అరెస్టు అప్రజాస్వామికమని, హరీష్ కు కోవిడ్ పాజిటివ్ ఉన్నప్పటికీ అరెస్టు చేసి జైలుకు తరలించడం సరికాదన్నారు. అరెస్టులకు బీజేపీ భయపడదని, ఇంకా ఎంత మందిని అరెస్టు చేస్తారో నేనూ చూస్తానని ఆయన హెచ్చరించారు. హాస్పిటల్ లో కోవిడ్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటుంటే తెల్లవారుజామున అరెస్టు చేస్తారా?.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా... అరాచక రాజ్యంలో ఉన్నామా? అరెస్టులు చేయడం, నెలల తరబడి జైల్లో పెట్టడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందని ఆయన విమర్శించారు. గిరిజనుల్ని, గిరిజనుల తరపున మాట్లాడుతున్న వాళ్లని కేసీఆర్ అణిచివేయాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు. సూర్యాపేట జిల్లా గుర్రంపోడులో కూడా గిరిజనులకు మద్దతుగా వెళ్లిన బీజేపీవాళ్లను నెలల తరబడి జైల్లో పెట్టారని, ఇలా అరెస్టులతో భయపెట్టాలని చూస్తూ భయపడేందుకు ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరని ఆయన పేర్కొన్నారు. పోడు భూముల సమస్య పరిష్కరించేదాకా మేము పోరాడుతునే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తా అంటూ ఆరున్నరేళ్లుగా కేసీఆర్ మోసం చేస్తూనే ఉన్నాడని, పోడు సమస్యపైనా, గిరిజనుల సమస్యపైనా పోరాటం చేసేవాళ్లను జైల్లో పెట్టడమే కేసీఆర్ చూపిస్తున్న పరిష్కారమా?.. ఎంత మందిని అరెస్టు చేస్తారా నేనూ చూస్తా.. కోవిడ్ పేషేంట్ అయిన హరీష్ బాబును జైల్లో పెడుతున్నారు.. ఆయన ఆరోగ్యానికి ఏమైనా జరిగితే తర్వాత జరిగే పరిణామాలకు కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది..’’ అని బండి సంజయ్ హెచ్చరించారు.
ఆదిలాబాద్ జైలుకు పాల్వాయి హరీష్ బాబు
పాల్వాయి హరీష్ బాబుకి సిర్పూర్-టి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సెక్షన్ 307, పోలీసులపై దౌర్జన్యం, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరు పరచిన హరీష్ బాబును ఆదిలాబాద్ జైలుకు తరలించాలని పోలీసులను జూనియర్ సివిల్ జడ్జి ఆదేశించారు. పాల్వాయి హరీష్ బాబుకి కోవిడ్ పాజిటీవ్ ఉన్నందున డాక్డర్ల పర్యవేక్షణలో చికిత్స అందించాలని కోర్టు ఆదేశించింది.