నీ అంతు చూస్తా.. ట్రాన్స్​ఫర్ ​చేయిస్తా : ఏఈకి కౌన్సిలర్ భర్త వార్నింగ్​

  • సిరిసిల్లలో ఘటన
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆఫీసర్​

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలో బీఆర్​ఎస్​ పార్టీ  కౌన్సిలర్ భర్త మున్సిపల్ ఉద్యోగిపై చిందులేశాడు. ‘నీ అంతు చూస్తా.. నేను తలుచుకుంటే ట్రాన్స్​ఫర్ చేయిస్తా. నాకు నచ్చకపోతే గతంలో పని చేసిన మున్సిపల్ కమిషనర్​నే ట్రాన్స్‌‌ఫర్ చేయించా..ఆఫ్​ట్రాల్ నువ్వో ఏఈవి. నాకు నచ్చిన పనే చేయాలే’ అని వార్నింగ్​ ఇచ్చాడు. సిరిసిల్ల మున్సిపల్ ఆఫీసులో నరసింహస్వామి ఏఈ. మంగళవారం 37వ వార్డులో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ పనులను ఏఈ పరిశీలించాడు.

డిజైన్‌‌కు విరుద్ధంగా పనులున్నాయని బీఆర్​ఎస్​ కౌన్సిలర్ దిడ్డి మాధవి భర్త దిడ్డి రాజు దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో  రాజు.. ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో సదరు ఏఈ మున్సిపల్ ఉద్యోగులతో కలిసి పోలీస్​స్టేషన్‌‌కు వెళ్లి కౌన్సిలర్ భర్తపై ఫిర్యాదు చేశారు. అప్పటికే అప్రమత్తమైన మున్సిపల్ చైర్మన్ భర్త జిందం చక్రపాణి ఉద్యోగులతో చర్చలు జరిపి ఏఈకి నచ్చజెప్పినట్టు సమాచారం.