తాను పార్టీ మారే ప్రసక్తి లేదని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. తాను 200శాతం సంతృప్తిగా ఉన్నాను, పార్టీలో ఉంటానని స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికలలో కూడా తానే పోటీ చేస్తానన్న ఆయన... కేసీఆర్ కుటుంబ సభ్యులందరితోనూ తనకు సత్సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. పుకార్లు షికార్లు చేసినా ఎవరూ నమ్మొద్దని చెప్పారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబాన్ని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేస్తారు, మరచిపోతారని అనుకుంటారు అంతా ... కానీ తాను ఎన్నికల వాగ్దానాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అందులో భాగంగానే సీతాఫల్ మండిలో జూనియర్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
అసాధ్యం అనుకున్న దానిని పోరాడి సాదించుకున్నామన్న పద్మారావు... సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అక్కడ మద్యతరగతి ప్రజలే ఎక్కువ ఉన్నారని, రూ.102కోట్ల నిధులతో అనేక అభివృద్ధి పనులన్ని చేపట్టామని తెలిపారు. ఏడాదిన్నర కాలంలోనే పనులన్నీ పూర్తి చేసే విధంగా ప్రణాళిక చేశామని స్పష్టం చేశారు. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దనే నియమం ఉందన్న పద్మారావు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గా ఉన్నా తాను టీఆర్ఎస్సే గెలుస్తుందని చెబుతా కదా అని అన్నారు. బూర నర్సయ్య గౌడ్ కు ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు ఆత్మగౌరవ సమస్య రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు ఎందుకు పార్టీ మారలేదని ప్రశ్నించారు. కిషన్ రెడ్డితోనూ తనకు సత్సంబంధాలు ఉన్నాయని, అసెంబ్లీలో కూడా పక్కపక్కనే కూర్చునే వారమని చెప్పారు.