
- ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదు
- గాంధీ ఫ్యామిలీతో అనుబంధం ఉంది
- కేంద్ర కేబినెట్ అనుమతిస్తే మెట్రో పనులు స్టార్ట్ చేస్తం
- కేసీఆర్ అసెంబ్లీలో చర్చలకు రావాలె
- ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్
ఢిల్లీ: తాను ఎవరి ట్రాప్ లో పడబోనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనకు గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం ఉందని చెప్పారు. ఈ విషయంలో ఫొటోలు చూపించాల్సిన అవసరం లేదన్నారు. తానెవరో తెలియకుండానే పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా..? అని ప్రశ్నించారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి కాదు.. అసెంబ్లీలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నందునే తనను ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు.
కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టే రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు సాధించుకొని రావాలని తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. మిగతా రాష్ట్రాల కేంద్ర మంత్రులు వారి స్టేట్స్ కు కావాల్సినవి సాధించుకుంటున్నారని చెప్పారు. కిషన్ రెడ్డి మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తాను ప్రధానిని ఆరు గ్యారెంటీలు అడగడం లేదని, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన అడుగుతున్నానని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులపై విన్నవిస్తున్నట్టు చెప్పారు. మెట్రోకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే పనులు మొదలవుతాయని అన్నారు. మెట్రో విస్తరణ హైదరాబాద్ కు గేమ్ చేంజర్ గా మారనుందని అన్నారు.
పదేండ్లలో కేసీఆర్ ఒక్క పాలసీ కూడా తేలేదని, తాను చేసినన్ని ఎవరూ చేయలేదని అన్నారు. నిరుద్యోగాన్ని 8.8 శాతం నుంచి 6.2%కు తగ్గించగలిగానని అన్నారు. 2.2 లక్షల కోట్ల పెట్టుడులు తెలంగాణ కి తెచ్చామని వివరించారు. పన్ను వసూళ్లు లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. రైతుల పొలాలు ఎండిపోతుంటే, టన్నెల్ లో ప్రాణాలు పోతుంటే, ప్రజలు కష్టాల్లో ఉంటే బిఆర్ ఎస్ నేతలు డ్యాన్సులు వేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
60 దేశాల ప్రతినిధులతో భారత్ సమ్మిట్
తెలంగాణలో "భారత్ సమ్మిట్" పేరుతో సుమారు 60 దేశాల నుంచి ప్రతినిధులతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వంటి వారు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం "పొలిటికల్ క్లియరెన్స్" ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ విషయంపైనే విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ని కలుస్తున్నానని సీఎం చెప్పారు.