యాత్రికులే లక్ష్యంగా ఆన్లైన్ మోసాలు.. ఇలా చేస్తే ఫ్రాడ్స్టర్లకు చిక్కినట్టే: హోంశాఖ అలెర్ట్

యాత్రికులే లక్ష్యంగా ఆన్లైన్ మోసాలు.. ఇలా చేస్తే ఫ్రాడ్స్టర్లకు చిక్కినట్టే: హోంశాఖ అలెర్ట్

దేశవ్యాప్తంగా మతపరమైన యాత్రికులు ,పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఆన్‌లైన్ బుకింగ్ మోసాల గురించి హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) శనివారం (ఏప్రిల్ 19) ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది.ఆన్ లైన్ పేమెంట్లు చేసేముందు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలిని సూచించింది. పేమెంట్ చేసే ముందు ఉపయోగించే వెబ్ సైట్లను ఒకసారి చెక్ చేసుకోవాలని తెలిపింది. గూగుల్, ఫేస్ బుక్, వాట్సాప్ లలోని వచ్చిన లింకులపై క్లిక్ చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. 

అధికారిక ప్రభుత్వ పోర్టల్స్ లేదా నమ్మకమైన ట్రావెల్ ఏజెన్సీల ద్వారా మాత్రమే బుకింగ్‌లను చేసుకోవాలని హోంమంత్రిత్వ శాఖ కోరింది. ఏదైనా మోసం జరిగితే పౌరులు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లేదా హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయడం ద్వారా జరిగిన మోసాలను వెంటనే తెలపాలని కోరింది. 

కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ బుకింగ్‌లను అధికారిక పోర్టల్ www.heliyatra.irctc.co.in ద్వారా మాత్రమే చేయవచ్చు. సోమనాథ్ ట్రస్ట్‌కు గెస్ట్ హౌస్ బుకింగ్‌లను ట్రస్ట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా చేయవచ్చని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

నకిలీ వెబ్‌సైట్‌లు, మోసపూరిత సోషల్ మీడియా పేజీలు, ఫేస్‌బుక్ పోస్ట్‌లు,గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్‌లలో పేమెంట్స్ ప్రకటనల ద్వారా ఈ మోసాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ మోసాలలో ప్రొఫెషనల్‌గా కనిపించే నకిలీ వెబ్‌సైట్‌లు,సోషల్ మీడియా ప్రొఫైల్‌లు,కేదార్‌నాథ్, చార్ ధామ్‌లకు హెలికాప్టర్ బుకింగ్ వంటి సేవలను అందించే నకిలీ వాట్సాప్ ఖాతాలను సృష్టించడం జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. 

Also Read:- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..మీ డేటాను సేవ్ చేస్తుంది

ఇటువంటి మోసాలను అరికట్టడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అన్ని చర్యలు చేపట్టింది. ఆన్ లైన్ మోసాలను ముందే గుర్తించేందుకు గూగుల్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి ఐటీ మధ్యవర్తులతో స్కామ్ సంకేతాలను క్రమం తప్పకుండా షేర్ చేస్తుందని తెలిపింది. కేంద్రం సైబర్ క్రైమ్ హాట్‌స్పాట్‌లను గుర్తించి సంబంధిత రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలను కూడా అప్రమత్తం చేస్తుందన్నారు. 

ప్రజలను రక్షించడానికి నకిలీ వెబ్‌సైట్‌లు, ప్రకటనలు ,నకిలీ సోషల్ మీడియా ఖాతాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. అటువంటి మోసాలను సులభంగా గుర్తించేందుకు వీలుగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో అనుమానితులను తనిఖీ చేసే, నివేదించే ఫీచర్ అభివృద్ధి చేయబడిందని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.