ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలోపేతమే లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎయిర్ ఫోర్స్ కు కొత్తగా 70 వేల అధునాతన తుపాకులు అందించాలని నిర్ణయించింది. దీని కోసం రష్యాతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ వాడుతున్న ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో.. 70 వేల ఏకే 103 తుపాకుల కొనుగోలుకు రష్యాకు ఆర్డర్ ఇచ్చింది. అత్యవసరంగా వీటిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కొన్ని నెలల్లోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 300 కోట్ల రూపాయలతో ఈ తుపాకులు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే నేవీలోని మెరైన్ కమాండోల దగ్గర ఏకే 103 రైఫిల్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చే రైఫిల్స్ ను జమ్మూకశ్మీర్ లో సెన్సిటీవ్ ఏరియాల్లో పనిచేసే సైనికులకు అందించనున్నారు.
వీటితో పాటు.. ఏకే 203 రైఫిల్స్ కొనుగోలుకు త్వరలోనే ఒప్పందం జరగనుంది. దేశంలోనే వీటిని తయారు చేయనున్నారు. రష్యాతో ఒప్పందం తర్వాత.. దేశంలో ఆర్మీ ఆధ్వర్యంలో వీటిని తయారుచేయనున్నారు. దాదాపు ఆరున్నర లక్షల ఏకే 203 రైఫిల్స్ కొనుగోలు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే లక్షన్నర అమెరికన్ సిగ్ సార్స్, 16 వేల నెగెవ్ లైట్ మెషిన్ గన్స్.. సైనికులకు అందించారు.