చౌటుప్పల్, వెలుగు: తాను కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరుతున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, నిరూపించలేకపోతే మంత్రి జగదీశ్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే మంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం చౌటుప్పల్‌లో బీజేపీ కార్యకర్తలతో సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. హత్య కేసులో జైలుకు వెళ్లొచ్చిన జగదీశ్ రెడ్డికి తనను విమర్శించే స్థాయి లేదన్నారు. మంత్రికి వెయ్యి కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.
2014 ముందు సొంత ఇల్లు కూడా లేని జగదీశ్ రెడ్డి ఆస్తులు ఏడేండ్లలో వేల కోట్లకు ఎట్లా పెరిగాయనే దానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. శంషాబాద్ ఏరియాలో 70 ఎకరాల్లో ఫాంహౌస్ నిర్మించుకున్నాడని ఆరోపించారు. జగదీశ్ రెడ్డి నీ ఆస్తుల చిట్టా బయట పెడితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా అని సవాల్ విసిరారు. 2009 తర్వాత ప్రజాసేవ కోసం తాను ఆస్తులను అమ్ముకున్నానని, కాంట్రాక్టు పనులకు కక్కుర్తిపడే వ్యక్తిని కాదని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. రాజకీయంగా తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని, ఇవన్నీ ప్రజలు గమనించి ధర్మం వైపు నిలబడతారని, తనను గెలిపిస్తారని అన్నారు. ఈనెల 21న మునుగోడులో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్టు తెలిపారు. తనతోపాటు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు చేరుతున్నారని చెప్పారు.
నా రాజీనామా తర్వాతే మునుగోడులో పనులు
తన రాజీనామా తర్వాత మునుగోడులో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో మూడున్నరేండ్లు కొట్లాడినా నియోజకవర్గానికి ఒక రూపాయి కూడా కేటాయించలేదని, రాజీనామా చేస్తున్నట్టు తెలియగానే గట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేయడంతోపాటు చౌటుప్పల్ నుంచి రోడ్డు నిర్మాణాన్ని, మాల్ మర్రిగూడ రోడ్డు పనులను చేపట్టారని తెలిపారు. తన రాజీనామాతో ఫామ్ హౌస్'లో పడుకునే ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌కు వచ్చి మునుగోడు అభివృద్ధిపై రివ్యూ చేశారని చెప్పారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మునుగోడు ప్రాంత ప్రాజెక్టులను పట్టించుకోలేదని, నిర్వాసితులకు నష్ట పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌లో భాగమైన శివన్న గూడెం ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేదని, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదని ఆరోపించారు. మునుగోడు ప్రజల ఆత్మ గౌరవం కోసం తాను రాజీనామా చేశానని, ఆ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి తనని మళ్లీ గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రమే బంగారుమయం చేసుకున్నాడని రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు.