T20 World Cup 2024: అతడు ఎనిమిదో వింత: నాయబ్ గాయంపై న్యూజిలాండ్ దిగ్గజం కౌంటర్

T20 World Cup 2024: అతడు ఎనిమిదో వింత: నాయబ్ గాయంపై న్యూజిలాండ్ దిగ్గజం కౌంటర్

టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ గుల్బాదిన్ నాయబ్ చేసిన కామెడీ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ పై నెటిజన్స్ తెగ మీమ్స్ చేస్తున్నారు. వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్ లో భాగంగా మంగళవారం (జూన్ 25) బంగ్లాదేశ్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 8 పరుగుల తేడాతో  గెలిచి వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి సెమీ ఫైనల్ కు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ విజయం నాయబ్ చేసిన కామెడీ హైలెట్ గా నిలిచింది. 

116 పరుగుల లక్ష్య ఛేదనలో మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది. ఈ దశలో ఇన్నింగ్స్ 12 ఓవర్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. మబ్బులు కమ్మి చినుకులు పడుతుండడంతో ఆఫ్గన్ ప్రధాన కోచ్ జోనాథన్ ట్రాట్ చేసిన ఒక పని వైరల్ అవుతుంది. వర్షం పడుతుండడంతో డ్రెస్సింగ్ రూమ్ నుంచి సమయం వృధా చేయండి అన్నట్టుగా సంకేతమిచ్చాడు. అప్పటికే డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో రెండు పరుగులు ఆఫ్ఘనిస్తాన్ ముందుండడంతో స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న నాయబ్ ను తిమ్మిర్లు వచ్చాయని కింద పడ్డాడు. అయితే అప్పటికప్పుడు అతని మోకాలికి తిమ్మిర్లు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. 

అంతే కాదు ఈ సీన్ లో నాయబ్ తన నటనతో అదరగొట్టాడు. అచ్చం గాయం అయినట్టుగానే యాక్టింగ్ చేశాడు. దీంతో కొద్ది సేపు గ్రౌండ్ లో డ్రామా చోటు చేసుకుంది. ఈ దశలో వర్షం పడి మ్యాచ్ రద్దయితే ఆఫ్ఘనిస్తాన్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించి ఉండేది. అయితే వర్షం వెంటనే తగ్గిపోవడంతో మళ్ళీ మ్యాచ్ కొనసాగింది. నాయబ్ కామెడీపై ఇయాన్ స్మిత్  అదిరిపోయే కౌంటర్ విసిరాడు. "గుల్బాదిన్ నాయబ్ డాక్టర్ ను నేను కలవాలి. అతని మోకాలి గాయం చిటికలో మాయమైపోయింది. నేను ఆరు నెలలుగా మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నాను. నాయబ్ డాక్టర్ ప్రపంచంలో ఎనిమిదో వింత. ఈ మ్యాచ్ తర్వాత నేను అతన్ని కలవబోతున్నాను". అని ఆయన అన్నాడు.