రాజకీయ మార్కెట్​లో.. జేబుదొంగలు, గజదొంగలు, బందిపోట్లు

  • ఇక్కడెవరూ సుద్ధపూసల్లేరు 
  • ప్రజాస్వామ్యంలో దొంగలను  మార్చడం కూడా ముఖ్యమే 
  • విద్వేషాలు రగిలిస్తున్న మోదీని ఓడించాలి
  • జాగో తెలంగాణ యాత్రలో రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి

భీమదేవరపల్లి/జమ్మికుంట, వెలుగు : విద్వేషాలను రగిలిస్తున్న మోదీని ఓడించాలని సోషల్ డెమోక్రటిక్​ ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్​ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. జాగో తెలంగాణ ఓటర్ల చైతన్య యాత్ర సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయ మార్కెట్ లో జేబుదొంగలు, గజదొంగలు, బందిపోట్లు ఉన్నారని, ఇక్కడెవరూ సుద్ధపూసల్లేరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో దొంగలను మార్చడం కూడా ముఖ్యమేనన్నారు.

 దేశంలో మోదీ కట్టించిన ఒక్క ఇల్లు కూడా లేదని, రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో 10 నుంచి 12 లక్షల కోట్లు తీసుకెళ్లి..ఒక్క బడి, హాస్పిటల్​కూడా కట్టియ్యలేదన్నారు. రైతు నల్ల చట్టాల రద్దు సమయంలో స్వామినాథన్​కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని, ఆ తర్వాత విస్మరించారని, స్వామినాథన్​కు భారతరత్న ఇవ్వడంలోనూ రాజకీయ స్వార్థం ఉందన్నారు. 

దేశంలో 60 శాతం ఉన్న బీసీల కులగణన చేయాలని డిమాండ్​చేస్తుంటే బీజేపీ పట్టించుకోవడం లేదని, కులగణన చేపడితే 10 శాతం ఉన్న  అగ్రవర్ణాల ఆస్తులన్నీ బయటపడతాయనే మోదీ నిరాకరిస్తున్నారని అన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం దేశంలోని 500 సీట్లలో పోటీ చేయడానికి  కోటి చొప్పున 500 కోట్లు సరిపోతాయని, కానీ మోదీ మాత్రం కార్పొరేట్లు, కంపెనీలను బలవంతం చేసి ఈడీ, ఐటీ, సీబీఐని ఉసిగొల్పి ఎలక్షన్​బాండ్స్, ఇతర రూపంలో రూ.16 వేల కోట్లు వసూలు చేశాడని మండిపడ్డారు.

 యాత్రలో ప్రొఫెసర్లు లక్ష్మీనారాయణ, పద్మజ, డాక్టర్ ఎదులాపురం తిరుపతి, ఎన్ఆర్ఐ మంతెన రామదాసు, సామాజిక కార్యకర్త గోవర్ధన్, హనుమేశ్ ​పాల్గొన్నారు. కరీంనగర్ ​జిల్లా జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద మురళి మాట్లాడుతూ బీజేపీ.. పేదల కోసం కట్టించిన ఒక్క ఇల్లయినా హుజూరాబాద్ నియోజకవర్గంలో కనబడుతుందా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ చెప్పిందని, ఆ హామీలు ఎక్కడికి పోయాయన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని, ప్రశ్నించే గొంతులు ఉన్నప్పుడే హక్కులు కల్పించబడతాయన్నారు.