ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలోని గోమతి నగర్‌లో ఉన్న కోచింగ్ సెంటర్‌లో ఇద్దరు సివిల్స్ అభ్యర్థులు లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. శనివారం రాత్రి క్లాసెస్ ముగించుకున్న సివిల్స్ ఆస్పిరెంట్స్ తమ ఇళ్లకు వెళ్లేందుకు కిందకు దిగుతుండగా దాదాపు 45 నిమిషాల పాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు.
UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం సిద్ధమవుతన్న అభ్యర్థులు క్లాసెస్ ముగించుకుని రాత్రి 8 గంటలకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ స్టార్టయ్యాక అకస్మాత్తుగా అంతస్తుల మధ్య ఆగిపోయింది. కిందకు వెళుతున్న సమయంలో లిఫ్ట్ మధ్యలో ఐదో అంతస్తులో ఆగిపోవడంతో బాధితులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే తమను రక్షించాలంటూ కేకలు వేశారు.
అయినప్పటికీ వారిని రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో లిఫ్టులో ఇరుక్కుపోయిన శోభా సింగ్ అనే అభ్యర్థి తన పరిస్థితిని తన భర్త పవన్ సింగ్‌కు ఫోన్ చేసి తెలిపింది. అతను కోచింగ్ సెంటర్‌కు చేరుకుని అధికారులకు ఫోన్ చేశాడు. లిఫ్ట్‌ను సరిచేసి తన భార్యను, ఇతర విద్యార్థులను రక్షించాలని అధికారులను వేడుకున్నాడు. అయితే పవన్ సింగ్ కు అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
దీంతో ఈ తతంగాన్నంతా పవన్ వీడియోరూపంలో రికార్డ్ చేశాడు. వెంటనే పవన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. వీడియో చూసిన అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లిఫ్ట్ ఆపరేటర్ సహాయంతో లోపాన్ని సరిచేసి చిక్కుకుపోయిన ఇద్దరు సివిల్స్ అభ్యర్థులను రక్షించారు.
కాగా ఒక ఎలుక మెటల్ తాడులో ఇరుక్కుపోయి లిఫ్ట్ విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. దానికి తోడు లిఫ్ట్‌కు సంబంధించిన మాస్టర్ కీ సెక్యూరిటీ గార్డు వద్ద లేకపోవడంతో బాధితులను రక్షించడంలో జాప్యం జరిగిందన్నారు.