బిహార్ గ్యాంగ్‌స్టర్.. రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్ పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓ దళిత ఐఏఎస్ హత్య కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే తాజాగా ఆనంద్ మోహన్ విడుదలకు బీహార్‌లోని నితీశ్ కుమార్ సర్కార్ మార్గం సుగమం చేసింది. ఇదే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
1994లో బిహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ సీఎంగా ఉన్న సమయంలో బిహార్ పీపుల్స్ పార్టీ నేత ఛోటన్ శుక్లాను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దీంతో బిహార్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. బీపీపీ వ్యవస్థాపకుడు ఆనంద్ మోహన్ వేలాది మంది పార్టీ కార్యకర్తలతో కలిసి శుక్లా అంతిమ యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా 35 ఏళ్ల ఐఏఎస్ అధికారి జి. క్రిష్ణయ్యను కారులో నుంచి బయటకు లాగి ఆయనపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో జి. కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఆందోళనకారుల్ని రెచ్చగొట్టి ఐఏఎస్ అధికారి కృష్ణయ్య మృతికి కారణమైన ఆనంద్ మోహన్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. జైల్లో ఉన్న సమయంలో ఎంపీగా పోటీ చేసి.. ఎన్నికల్లో విజయం సాధించారు. ఎంపీగా ఉన్న వేళలోనే అతనికి ఉరిశిక్ష విధించటంతో పదవిని కోల్పోయారు. ఆ తర్వాత అతనికి పడిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు
కృష్ణయ్య ఎవరో తెలుసా...
ఆనంద్ మోహన్ అనుచరుల దాడిలో చనిపోయిన ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్యది తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన ఆయన.. కూలి పని చేశారు. జర్నలిజం చేసిన కృష్ణయ్య...కొంతకాలం క్లర్కుగా, లెక్చరర్‌గా కూడా పని చేశారు. 1985లో సివిల్స్ లో పాస్ అయి ఐఏఎస్‌గా బిహార్ క్యాడర్‌కు ఎంపికయ్యారు .బందిపోట్లు, కిడ్నాపర్లపై ఉక్కుపాదం మోపారు. ఆ తర్వాత సీఎం లాలూ సొంత జిల్లా గోపాల్‌గంజ్ కలెక్టర్‌గా ఉండగా హత్యకు గురయ్యారు. ఈ దారుణంపై సీఎం హోదాలో లాలూ స్పందించిన తీరు అప్పట్లో విమర్శలపాలైంది.
లాలూ వెళ్లిపో...
ఐఏఎస్ కృష్ణయ్యకు నివాళులర్పించేందుకు వచ్చిన సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ను వెళ్లిపొమ్మని ఆయన భార్య ఉమా దేవి తెగేసి చెప్పింది. నేరగాళ్లను జైళ్ల నుంచి విడుదల చేసి సమాజంపైకి ఉసిగొల్పే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉండదని ఆమె చెప్పడం ఇప్పటికీ గుర్తే.
ఆనంద్ మోహన్ తో ఏం అవసరం..
ఏప్రిల్ 10న బిహార్ ప్రభుత్వం బిహార్ జైలు మాన్యువల్ 2012కు సవరణలు చేసింది. దీని ప్రకారం విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల హత్య కేసుల క్లాజుకు సవరణలు చేసింది. సవరణకు ముందు ఉన్న క్లాజ్ ప్రకారం ఆనంద్ మోహన్ విడుదలకు అవకాశం లేదు. అయితే నిబంధనను మార్చడంతో ఆనంద్ మోహన్ విడుదలవనున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే బిహార్లో ఆనంద్ మోహన్ కొడుకు , ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ ఎంగేజ్ మెంట్ జరిగింది. దీనికి పెరోల్ మీద వచ్చిన ఆనంద్ మోహన్ ఈ వేడుకలో పాల్గొన్నాడు. ఈ ఎంగేజ్ మెంట్ కు సీఎం నితీశ్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తో సహా పలువురు రాజకీయ నేతలు వచ్చారు. ఈ ఎంగేజ్ మెంట్ వేళలోనే ప్రభుత్వం నిబంధనలు మార్చడం గమనార్హం. ఆర్జేడీ ఎమ్మెల్యే పెళ్లికి నిబంధనలు మార్చి.. సీఎం నితీశ్ గిఫ్టు ఇచ్చారా? అనే సందేహం స్థానికంగా వ్యక్తమవుతోంది.