
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ కె. రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రస్తుతం రామకృష్ణారావు విధుల్లో ఉన్నారు. ఏప్రిల్ 30వ తేదీతో ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి పదవీ కాలం ముగుస్తుంది. మే 1వ తేదీ నుంచి ఐఏఎస్ రామకృష్ణారావు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
నిజానికి సీనియారిటీ పరంగా కొత్త సీఎస్ రేసులో ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ ముందున్నప్పటికీ.. ఆర్థిక శాఖలో రామకృష్ణారావుకు ఉన్న సుదీర్ఘ అనుభవం, తెలంగాణ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండడంతో ఆయన వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. బీఆర్ఎస్ హయాంలో రామకృష్ణారావును సీఎస్ పదవి వరిస్తుందని భావించినప్పటికీ దక్కలేదు. రామకృష్ణారావు ఈ ఏడాది ఆగస్టులోనే రిటైర్ అవుతున్నారు. ఆయనను సీఎస్గా ప్రభుత్వం తీసుకుంది కాబట్టి పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వీ కర్ణన్, జెన్ కో సీఎండీగా ఎస్.హరీశ్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్ గా శశాంక్ గోయల్, ఇండస్ట్రీ, ఇన్వెస్ట్ మెంట్ సెల్ సీఈవోగా జయేశ్ రంజన్, పరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్ కుమార్, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఎండీఏ వెలుపల)- టీకే శ్రీదేవి, హెచ్ఎండీఏ పరిధిలో పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఇలంబర్తిని ప్రభుత్వం నియమించింది.
తెలంగాణ నూతన చీఫ్ సెక్రటరీ(సీఎస్)గా కే రామకృష్ణారావు (IAS) నియామకం
— LATEST NEWS TO DAY (@VRajeshekar) April 27, 2025
మే 1 నుండి బాధ్యతలు స్వీకరించనున్న కే రామకృష్ణారావు pic.twitter.com/Wuq7829itz
ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ కమిషనర్ గా కె.శశాంక్, రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవోగా నిఖిల, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా సంగీత సత్యనారాయణ.. దేవాదాయ శాఖ డైరెక్టర్, యాదగిరిగుట్ట సీఈవోగా ఎస్. వెంకటరావు, సెర్ప్ అదనపు సీఈవోగా పి.కాత్యాయనీదేవి, ఇండస్ట్రీ, ఇన్వెస్ట్ మెంట్ సెల్ అదనపు సీఈవోగా ఈవీ నర్సింహారెడ్డి నియమితులు కావడం గమనార్హం.