పూల్ గేమ్ ‘బిలియర్డ్స్’ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒక గ్రీన్ టేబుల్ అందులో 16 బాల్స్ ఉంటాయి. అది ఆడడానికి డబ్బులు పెట్టి స్పోర్ట్స్ క్లబ్‌లల్లో ఆడుతుంటారు చాలామంది. ఆ గేమ్ ఆడాలని ఉన్నా అంత డబ్బు పెట్టలేని ఒక చిన్న పిల్లాడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎంత ఉన్నా... ఇంకా ఏదో కావాలి అని ఆశపడే కాలం ఇది. అలాంటిది ఉన్నదాంట్లోనే ఆనందాన్ని ఎలా వెతుక్కోవచ్చో ఈ వీడియోలో కనిపిస్తుంది. ఏ చిన్నపని చేసినా దాంట్లో స్థాయిని చూడకుండా సంతోషం వెతకాలి. అప్పుడే లైఫ్ సాఫీగా ఉంటుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియో. తన ఫ్రెండ్స్‌తో పూల్ గేమ్ ఆడాలని ఉన్నా ఈ పిల్లాడు వాళ్ల పేరెంట్స్ దగ్గర ఏడ్చి గోల చేయలేదు. వాళ్ల దగ్గర ఉండే ఇటుకలను ఒకదానిపైన ఒకటి పేర్చి పూల్ గేమ్ టేబుల్‌ను తయారుచేసుకున్నాడు. దాంట్లో కొన్ని బాల్స్ వేసి ఒక కట్టెతో ఆ గేమ్ ఆడుతుంటాడు. దాంట్లో ఫన్నీ ఏంటంటే గేమ్ ఆడుతూ ఆ టేబుల్‌పైకి ఎక్కిమరీ బాల్స్‌ను కొడతాడు. అయితే ఈ వీడియో 2018లోనే వచ్చినా, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అంకుర్ లహోతి తన ట్విట్టర్‌లో మళ్లీ పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. వీడియో కింద ‘సంతోషాన్ని కావాలనుకునే వాళ్లకు అన్నీ ఉండాల్సిన పని లేదు. ఉన్న దాంట్లోనే ఆనందాన్ని వెతుకుతారు’ అని రాశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆ పిల్లాడి క్రియేటివిటీకి సలాం కొడుతున్నారు.