- ప్రభుత్వ నోటీసులకు అరవింద్ కుమార్ రిప్లై
హైదరాబాద్, వెలుగు: – బాధ్యత మొత్తం అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్‌దేనని ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ తెలిపారు. కేటీఆర్ చెప్తేనే ఫార్ములా ఈ-–రేస్ కోసం హెచ్ఎండీఏ నిధులు రూ.53 కోట్లు చెల్లించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెచ్‌ఎండీఏ నిధులు ఫార్ములా–-ఈ రేసుకు బదిలీ చేశారని ఆరోపణలు వచ్చినందున వివరణ ఇవ్వాలని అరవింద్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటీసులిచ్చింది.
ఈ క్రమంలో నోటీసులకు ఆయన రిప్లై ఇచ్చారు. గురువారం తొమ్మిది ప్రశ్నలతో కూడిన వివరణ లేఖను ప్రభుత్వానికి పంపారు. సీజన్ -9, 10 రేసింగ్‌లు నిర్వహించేందుకు జనవరి -2022లో ఒప్పందం జరిగిందని.. దీనికి పూర్తి బాధ్యత అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌దేనని లేఖలో పేర్కొన్నారు. ‘‘2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో సీజన్ -9 రేసింగ్ నిర్వహించాం. సీజన్- 10 హోస్ట్ సిటీగా హైదరాబాద్‌ను పోటీలో పెట్టాలని కేటీఆర్ నిర్ణయించారు.
అయితే ప్రమోటర్లు ముందుకురాకపోవడంతో హెచ్ఎండీఏ బాధ్యత తీసుకోవాలని ఆయన చెప్పారు. హోస్ట్ సిటీ కోసం రెండు విడతల్లో రూ.53 కోట్లు చెల్లించాం. తొలి విడతలో రూ.45 కోట్లు చెల్లించగా, పన్నుల రూపంలో మరో రూ. 8 కోట్లు చెల్లించాం. కేటీఆర్ ఆదేశాలతోనే 2023 అక్టోబర్ 5, 11 తేదీల్లో చెల్లింపులు జరిగాయి. ఫార్ములా ఈ-–రేసింగ్‌కు సంబంధించిన ప్రతి నిర్ణయం కేటీఆర్‌దే. ఆయన ఆదేశాలతోనే సెప్టెంబర్ 25న ఒప్పందం చేసుకున్నాం” అని వివరించారు.