ఐఏఎస్లను రిలీవ్ చేసిన ప్రభుత్వం.. ఆమ్రపాలి స్థానంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా ఇలంబర్తి

ఐఏఎస్లను రిలీవ్ చేసిన ప్రభుత్వం.. ఆమ్రపాలి స్థానంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా ఇలంబర్తి

హైదరాబాద్: తెలంగాణలో ఆరుగురు ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌లను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. ఐఏఎస్ అధికారులు.. రొనాల్డ్‌ రోస్‌, ప్రశాంతి, ఆమ్రపాలి, విశాలాక్షి, వాణీ ప్రసాద్‌, వాకాటి కరుణలను ప్రభుత్వం రిలీవ్ చేసింది. రిలీవ్ అయిన ఐఏఎస్ల స్థానాల్లో ఇన్ఛార్జ్లను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి స్థానంలో రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ కె.ఇలంబర్తికి అదనపు బాధ్యతలు అప్పగించింది. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్కు, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాకు, మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శిగా టి.కె.శ్రీదేవికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

ప్రభుత్వ ఆదేశాలతో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోగా ఆర్.వి.కర్ణన్, ఆయుష్ డైరెక్టర్ గా క్రిస్టినా అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తెలంగాణలో పనిచేస్తోన్న ఏపీ కేడర్ ఐఏఎస్‎లను తిరిగి ఏపీకి వెళ్లాలని.. ఏపీలో పని చేస్తోన్న తెలంగాణ కేడర్‎కు చెందిన ఐఏఎస్ అధికారులు తెలంగాణ వెళ్లాలని డీవోపీటీ ( Department of Personnel and Training ) (DoPT) ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో పని చేస్తోన్న ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, వాణి ప్రసాద్, ఏపీలో పని చేస్తోన్న తెలంగాణ కేడర్ అధికారిణి సృజన డీవోపీటీ ఆదేశాలను క్యాట్‎లో సవాల్ చేశారు. సొంత కేడర్ స్టేట్లకు వెళ్లాలన్న డీవోపీటీ ఆదేశాలను రద్దు చేస్తూ.. తమను ప్రస్తుతం పని చేస్తోన్న రాష్ట్రాల్లోనే  కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని వేర్వేరుగా క్యాట్‎కు విజ్ఞప్తి చేశారు. డీవోపీటీ ఆదేశాల ప్రకారం.. ఐఏఎస్ అధికారులు సొంత కేడర్ రాష్ట్రాలకు వెళ్లాలని క్యాట్ తీర్పు వెలువరించింది.

క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సదరు ఐఏఎస్లకు అక్కడ కూడా చుక్కెదురైంది. క్యాట్ తీర్పును సమర్థించిన తెలంగాణ హైకోర్టు సొంత కేడర్ రాష్ట్రాలకు వెళ్లాల్సిందేనని ఐఏఎస్లను ఆదేశించింది. రిపోర్ట్ చేశాకే సమస్యలు ఏవైనా ఉంటే వింటామని స్పష్టం చేసింది. దీంతో.. ఐఏఎస్లు రిలీవ్ అవ్వక తప్పలేదు. రిలీవ్ అయిన ఐఏఎస్ల స్థానాల్లో తెలంగాణ ప్రభుత్వం ఇలా ఇన్ఛార్జ్లను నియమించింది.