ఆఫీసర్లను నిలబెట్టి పనిచేయించిన ఐఏఎస్​ .. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం చూపడంతో శిక్ష

ఆఫీసర్లను నిలబెట్టి పనిచేయించిన ఐఏఎస్​ .. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం చూపడంతో శిక్ష

నోయిడా: ప్రభుత్వ సాయం కోసం వచ్చిన వృద్ధ దంపతులను వెయిట్ చేయించినందుకు ఆఫీస్ సిబ్బందిపై ఐఏఎస్ ఆఫీసర్ ఫైర్ అయ్యారు. వాళ్లందరినీ నిల్చునే పనిచేయాలని ఆదేశించారు. దీంతో స్టాఫ్ అంతా ఆయన ఆదేశాలను పాటిస్తూ నిలబడి పనిచేశారు. ఉత్తరప్రదేశ్​లోని నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్​మెంట్ అథారిటీకి చెందిన ప్రధాన కార్యాలయానికి పనులమీద నిత్యం ప్రజలు వచ్చిపోతుంటారు. అథారిటీకి సీఈవోగా అపాయింట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ లోకేశ్​కు స్ట్రిక్ట్ ఆఫీసర్​ అని పేరుంది. పనుల కోసం వచ్చే ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయడాన్ని ఆయన సహించరు. ఆఫీస్ సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు సీసీటీవీ ద్వారా మానిటర్ చేస్తుంటారు. సోమవారం వృద్ధ దంపతులు కౌంటర్ ముందు నిల్చుని ఉండటాన్ని ఆయన గమనించారు. 

వాళ్ల పని పూర్తిచేయాలని, కాకపోతే క్లారిటీ ఇచ్చి పంపించేయాలని సిబ్బందిని ఆదేశించారు. అయితే, 20 నిమిషాల తర్వాత కూడా వారు నిల్చుని ఉండటాన్ని లోకేశ్ గమనించారు. దీంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘వాళ్లలాగే మీరు కూడా 20 నిమిషాలు నిలబడి పనిచేయండి. అట్లయితేనే వృద్ధులు పడుతున్న కష్టాలేంటో మీకర్థమైతయ్” అని ఆదేశించి వెళ్లిపోయారు. దీంతో ఆ స్టాఫ్ అంతా నిల్చునే పనిచేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగా, ఆఫీసర్​ను జనం మెచ్చుకుంటున్నారు.