ఐఏఎస్​లు ఆదర్శంగా నిలవాలి

ఐఏఎస్​లు ఆదర్శంగా నిలవాలి

మాజీ  ఐఏఎస్ అధికారి  గోపాలకృష్ణ  రచించిన  ‘లైఫ్ ఆఫ్ ఎ కర్మయోగి’  పుస్తక ఆవిష్కరణ సందర్భంగా  ముఖ్యమంత్రి  రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలు  రాష్ట్రవ్యాప్తంగా  ప్రసార మాధ్యమాల్లో  చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఇక్కడ  గమనించాల్సిన ప్రధానాంశం ముఖ్యమంత్రి అసహనం కేవలం కొద్దిమంది అధికారుల మీద  మాత్రమే.ఐఏఎస్​ అధికారులందరినీ ఆయన విమర్శించలేదు.  

తన ప్రసంగంలో  భారత మాజీ ప్రధాని  డాక్టర్ మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్​, మరొక ఐఎఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ విశిష్ట సేవల గురించి  ముఖ్యమంత్రి రేవంత్​ ప్రస్తావించారు. అధికారులందరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా   మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి తలుచుకొన్నప్పుడు, ఆయన పాలనా సామర్థ్యంతోపాటు నిరాడంబరత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  దేశం  ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు   తన అద్భుత మేధాశక్తితో,  ప్రఙ్ఞా పాటవాలతో   దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి  కాపాడిన  ఆయన సేవలకు దేశం సర్వదా రుణపడి ఉంటుంది.  

అదేవిధంగా చీఫ్​ ఎన్నికల  కమిషనర్​గా భారత  రాజ్యాంగం  కల్పించిన విశేషాధికారాల్ని నిష్పక్షపాతంగా,  నిర్భయంగా,  ఏ ఒత్తిళ్లకు లొంగకుండా సేవలందించిన  టీఎన్​ శేషన్​ గురించి కూడా  ప్రత్యేకంగా స్మరించుకోవాలి.  కేవలం ప్రజా సంక్షేమం కోసమే పాటుపడాలని ఐఎఎస్ నిర్దేశిస్తోందని  విశ్వసించి, అదేబాటలో పయనించి, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్​గా విశిష్ట సేవలందించారు. 

ఎన్నికలంటే ఒక తంతు కాదని,  అది ఒక పవిత్ర యజ్ఞమని భావించి, లోపభూయిష్టమైన ఆనాటి ఎన్నికల విధానాన్ని సంస్కరించారు. ఆ  తరువాత కాలంలో ఎందరో ఎన్నికల  అధికారులకు మార్గదర్శిగా నిలిచిన శేషన్  గురించి తెలుసుకున్నప్పుడు.. ఈ నాటి చాలామంది  సివిల్ సర్వీస్ అధికారులకు  తమ పదవికున్న గొప్పదనం  ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది.

ఐఏఎస్​లకు  శేషన్ ఆదర్శం​ 

ఆ రోజుల్లో కొందరు ఐఏఎస్ అధికారులు  రాజకీయ నాయకుల బెదిరింపులకు భయపడి దిక్కుతోచని స్థితిలో  ఉన్నప్పుడు,   రాజ్యాంగానికి  కట్టుబడి ఉద్యోగ ధర్మం నిర్వహించే  ఐఏఎస్​లను ఏ  రాజకీయ నాయకులూ  ఏమీ చేయలేరని శేషన్​ నిరూపించారు.  ఐఏఎస్​లు తమ  విలువలని  మరిచినప్పుడు మాత్రమే రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తాల్సి వస్తుందని తెలిపారు. తన కార్యాచరణ ద్వారా ఎందరో  ఐఎఎస్ అధికారులకు  ఆత్మస్థైర్యాన్ని కలిగించి స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆదర్శనీయుడు టీఎన్ శేషన్.   

పదవిని స్వీకరించిన  తొలినాళ్ళలోనే  మన ఎన్నికల విధానంలో ఉన్న అవకతవకలని, లోపాలని శేషన్​  గుర్తించగలిగారు.  తప్పులతో రూపొందించే ఓటర్ల జాబితాలు,   పోలింగ్ స్టేషన్ల  నిర్వహణలో లోపాలు,  ఓటర్లను బెదిరించి ఓట్లు పొందే విధానాలు,  నిబంధనలను అతిక్రమించి అభ్యర్థులు  ఖర్చు చేసే ఖర్చులు,  గూండాయిజంతో పోలింగ్ బూత్​లను ఆక్రమించడం, అధికార దుర్వినియోగం లాంటి లోపాలు  గుర్తించి,  వాటిని సరిచేయడంలో  చాలా కఠినంగా  వ్యవహరించాడాయన.  ఏదేమైనా శేషన్ పట్టుదల వల్లనే తరువాతి కాలంలో  ఫొటో గుర్తింపు కార్డులు ప్రవేశపెట్టడం జరిగింది.  అంతేకాదు,  గోడల అందాలను చెడగొట్టే ఎన్నికల ప్రచార రాతలు కనుమరుగయ్యాయి.

దార్శనికుడు ఎస్.ఆర్.శంకరన్

ఒక సివిల్ సర్వెంట్​గా  విశిష్టమైన సేవలందించినందుకుగాను  2005లో  భారత ప్రభుత్వం  ప్రకటించిన ‘పద్మభూషణ్’  పురస్కారాల జాబితాలో తన పేరుండడంతో.. ‘నేను  నా విద్యుక్త ధర్మాన్ని మాత్రమే నిర్వహించాను. కేవలం దీనికిగాను పద్మభూషణ్​ను స్వీకరించలేను’  అని  ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని  సున్నితంగా తిరస్కరించిన మహనీయుడు 
ఎస్. ఆర్ శంకరన్.  ఉమ్మడి  ఆంధ్రప్ర్తదేశ్​  సర్వీస్​లో,   త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా  ఆయన దళిత, పీడిత, గిరిజన వర్గాలకు అందించిన సేవలు  చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. 

సామాజిక సంస్కరణలు తెచ్చారు

శంకరన్​ తన సర్వీస్ కాలంలో పల్లెపల్లెకూ తిరుగుతూ అక్కడి దళితుల బాధలు వింటూ, వారుపెట్టిన భోజనాన్నే  స్వీకరిస్తూ  ఆ పల్లెల్లోనో లేదా గూడాల్లోనో నిదురించి  వారి సమస్యలని పరిష్కరించేవారు.  ఇక ఆయన  అక్టోబర్ 7, 2010 రోజున హైదరాబాద్​లో  కన్నుమూసినా,  ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా  ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు  త్రిపుర రాష్ట్ర  దళితులు, గిరిజనులు  కూడా ఆయనను తలుచుకొంటున్నారంటే  ఆయన  విశిష్ట సేవలు ఏపాటివో అర్థమవుతాయి. 

తాను సర్వీస్​లో  ఉన్నప్పుడు  వెట్టి చాకిరి నిర్మూలన  చట్టం (1976) సక్రమంగా అమలయ్యేలా చూస్తూ  వేలాదిమంది వెట్టికార్మికులను బంధ విముక్తులని చేశాడు.  వాస్తవంగా తన జీవితాన్ని పేదల సంక్షేమం కోసమే అంకితం చేశాడాయన. ఈ అధికారుల సేవాతత్పరత  వల్లనే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  వారిని ఆదర్శంగా తీసుకోవాలని యువ అధికారులకు సూచించారు.  ఈ సూచన ప్రజా శ్రేయస్సు  దృష్ట్యా   సమర్థనీయం.. సూచనను పాటించే అధికారులు ప్రజల  గుండెల్లో చిరకాలం వీరిలాగే ఆదర్శంగా నిలిచిపోతారు.  

- బసవరాజు నరేందర్​రావు,అడ్వకేట్-