IAS Smita Sabharwal: స్మితా సబర్వాల్ దిష్టిబొమ్మకు రక్తాభిషేకం

సూర్యాపేట: దివ్యాంగులపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గరిడేపల్లిలో దివ్యాంగులు  జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. స్మితాసబర్వాల్ తీరును నిరసిస్తూ ఆమె దిష్టిబొమ్మకు కోడి రక్తంతో రక్తాభిషేకం చేశారు. వికలాంగుల ధర్నాతో NH 167 నేషనల్ హేవేపై మిర్యాలగూడ, కోదాడ రూట్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తక్షణమే స్మితా సబర్వాల్ దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

కీలక సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ ఎందుకు అంటూ ఇటీవల ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన పోస్ట్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే.  స్మితా సబర్వాల్ కామెంట్స్ పై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. మంత్రి సీతక్క, డిప్యూటీ సీఎం భట్టి, మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ క్రమంలో స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్ చేశారు. 

‘కెరీర్ పబ్లిక్‌లో పుట్టినా.. క్యారెక్టర్, బలం, ప్రైవసీలోనే పెంపొందించుకోవచ్చు.. స్వరం వణుకుతున్న నిజాన్నే మాట్లాడండి.. అంటూ ఐఏఎస్ ఆఫీసర్ ట్వీట్ చేశారు. అయితే ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో స్మితా సబర్వాల్ ఈ ట్వీట్ చేశారనే చర్చ జరుగుతోంది. దివ్యాంగుల రిజర్వేషన్‌పై వరుసగా విమర్శలు వస్తున్నా స్మితా సబర్వాల్ తగ్గేదేలేదంటున్నారు.