
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీలో పోస్టింగ్ కు సంబంధించి తన ఫైల్ క్లియర్ చేయాలని తెలంగాణ కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో కలిసి పార్లమెంటులోని చాంబర్ లో షాతో భేటీ అయ్యారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ లో పెండింగ్‌లో ఉన్న ఆమె ఫైల్ వ్యవహారాన్ని పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మైనింగ్ శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని దాదాపు రెండేళ్లు జైలు జీవితం గడిపారు.
నిర్దోషిగా బయటపడ్డ శ్రీలక్ష్మిని రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌ను కలిసిన ఆమె ఏపీలో పనిచేసే అవకాశం కల్పించాలని కోరారు. దీనికి కేసీఆర్ కూడా ఓకే చెప్పారు. నెల రోజుల క్రితం ఆమె తెలంగాణ కేడర్ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. కేంద్రం నుంచి క్లియరెన్స్ రాగానే ఏపీలో ఆమె బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.