దక్కని ఊరట.. క్యాట్ నిర్ణయంపై హైకోర్టుకు ఐఏఎస్‎లు..!

దక్కని ఊరట.. క్యాట్ నిర్ణయంపై హైకోర్టుకు ఐఏఎస్‎లు..!

డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేసిన ఐఏఎస్‎లకు కేంద్ర పరిపాలన ట్రిబ్యూనల్‎లో నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. డీవోపీటీ ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన క్యాట్.. డీవోపీటీ ఆదేశాల మేరకు ఐఏఎస్‎లు తమ సొంత రాష్ట్రానికి  వెళ్లాల్సిందేనని తీర్పు వెలువరించింది. క్యాట్‎లో చుక్కెదురు కావడంతో ఐఏఎస్‎లు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. క్యాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ 2024 అక్టోబర్ 16న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 

అయితే, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పని చేస్తోన్న ఐఏఎస్ అధికారులు 2024 అక్టోబర్ 16వ తేదీ లోపు సొంత కేడర్ స్టేట్‎లలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఐఏఎస్‎లు డీవోపీటీ ఆర్డర్‎ను క్యాట్‎లో ఛాలెంజ్ చేయగా అక్కడ నిరాశ ఎదురైంది. దీంతో క్యాట్ తీర్పును హైకోర్టులో సవాల్ చేసి.. తీర్పు అనంతరం రిపోర్ట్ చేయాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 

ALSO READ | ఎక్కడ వాళ్లు అక్కడికి వెళ్లాల్సిందే: ఐఏఎస్‎లకు క్యాట్ బిగ్ షాక్

కాగా, తెలంగాణలో పని చేస్తోన్న ఏపీ కేడర్ ఐఏఎస్‎లను తిరిగి ఏపీకి వెళ్లాలని.. ఏపీలో పని చేస్తోన్న తెలంగాణ కేడర్‎కు చెందిన ఐఏఎస్ అధికారులు తెలంగాణ వెళ్లాలని డీవోపీటీ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో పని చేస్తోన్న ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, వాణి ప్రసాద్, ఏపీలో పని చేస్తోన్న తెలంగాణ కేడర్ అధికారిని సృజన డీవోపీటీ ఆదేశాలను క్యాట్‎లో సవాల్ చేశారు. సొంత కేడర్ స్టేట్లకు వెళ్లాలన్న డీవోపీటీ ఆదేశాలను రద్దు చేస్తూ.. తమను ప్రస్తుతం పని చేస్తోన్న రాష్ట్రాల్లోనే  కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని వేర్వేరుగా క్యాట్‎కు విజ్ఞప్తి చేశారు. ఐఏఎస్‎ల పిటిషన్లపై క్యాట్ 2024, అక్టోబర్ 15న విచారణ చేపట్టింది. 

ఐఏఎస్ అధికారుల కేటాయింపుపై డీవోపీటీకే పూర్తి అధికారులు ఉన్నాయని ఐఏఎస్ అధికారుల తరుఫు లాయర్లు వాదనలు వినిపించారు. డీవోపీటీ సైతం క్యాట్ ముందు తమ వాదనలను వినిపించింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం డీవోపీటీ వాదనలతో ఏకీభవించింది. డీవోపీటీ ఆదేశాల ప్రకారం.. ఐఏఎస్ అధికారులు సొంత కేడర్ రాష్ట్రాలకు వెళ్లాలని క్యాట్ తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో క్యాట్ తీర్పుపై అధికారులు ఐఏఎస్ లు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకోవడంతో .. అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.