ప్రోబయోటిక్స్ ఉత్పత్తుల తయారీ..,భారత్ బయోటెక్, ఐఏఎస్ఎస్టీల మధ్య ఒప్పందం

ప్రోబయోటిక్స్ ఉత్పత్తుల తయారీ..,భారత్ బయోటెక్, ఐఏఎస్ఎస్టీల మధ్య ఒప్పందం
  • అగ్రిమెంట్లపై సంతకాలు చేసిన ఆయా సంస్థల ప్రతినిధులు

న్యూఢిల్లీ, వెలుగు: ఈశాన్య రాష్ట్రాల్లో సంప్రదాయ పద్ధతిలో తయారు చేసే ప్రోబయోటిక్స్, వినూత్న ఆరోగ్య ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు మూడు ప్రధాన సంస్థలు ముందుకొచ్చాయి. ఈ మేరకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ (బీబీఐఎల్), ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌ స్టడీ ఇన్‌‌‌‌ సైన్స్‌‌‌‌ అండ్ టెక్నాలజీ(ఐఏఎస్ఎస్టీ) గౌహతి, డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ)ల మధ్య గురువారం అవగాహన ఒప్పందం కుదిరింది.

ఈశాన్య రాష్ట్రాల్లో సంప్రదాయ పద్ధతిలో తయారు చేసే ప్రోబయోటిక్స్, వినూత్న ఆరోగ్య ఉత్పత్తులను తీసుకొచ్చే దిశలో ఈ ఒప్పందంపై ఆయా సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. డీఎస్టీ సెక్రటరీ ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ ఆధ్వర్యంలో ఐఏఎస్ఎస్టీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆశిష్ ముఖర్జీ, బీబీఐఎల్ నుంచి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా, డాక్టర్ యోగేశ్వర్ రావు ఈ ఒప్పందంపై సంతకం పెట్టారు. కాగా, ఈ ప్రోబయోటిక్స్‌‌‌‌పై ఐఏఎస్ఎస్టీ నిర్వహించిన పరిశోధనల్లో జీవక్రియ వ్యాధులను పరిష్కరించడం, ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సక్సెస్ అయింది.

అలాగే వ్యాక్సిన్, హెల్త్ సొల్యూషన్స్‌‌‌‌లో గ్లోబల్ లీడర్‌‌‌‌‌‌‌‌గా పేరున్న భారత్ బయోటెక్.. ఈ ప్రోబయోటిక్స్ రెగ్యులేటరీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రీ -క్లినికల్, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఒప్పందంతో ఐఏఎస్ఎస్టీ దాని శాస్త్రీయ అవగాహనతో పాటు పరిశోధన కార్యక్రమాల్లో ముఖ్య ప్రాత పోషించగా, భారత్ బయోటెక్ బిజినెస్‌‌‌‌ ప్రక్రియలో ప్రధానంగా వ్యవహరించనుంది. ఈ ఒప్పందంతో ప్రోబయోటిక్ ఉత్పత్తులు, బయో టెక్నాలజీ రంగంలో అభివృద్ధి, మధుమేహం, ఊబకాయం వంటి వ్యాధులకు సహజ పరిష్కారాలు కనుగొనేందుకు లైన్‌‌‌‌ క్లియర్‌‌‌‌‌‌‌‌ అయ్యే అవకాశం ఉంది.