IBM సంచలన నిర్ణయం..భారీగా ఉద్యోగాల కోత

IBM సంచలన నిర్ణయం..భారీగా ఉద్యోగాల కోత

ఇంటర్నేషన్ బిజినెస్ మిషన్స్ (IBM) సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే  రోజుల్లో కొత్త ఉద్యోగాల నియమాకాలను నిలిపివేయాలని  నిర్ణయించింది.  దాదాపు 30 శాతం ఉద్యోగులను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్  ద్వారా భర్తీ చేయాలని అనుకుంటోంది.  ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్  ద్వారా 7800 జాబ్స్ ను రీప్లేస్ చేయాలని భావిస్తోంది.  ముఖ్యంగా బ్యాక్ ఆఫీస్ జాబ్స్ ను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా నింపేందుకు ఐబీఎం  ప్రయత్నిస్తోంది.  ఈ మేరకు ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ వెల్లడించారు. 

నాన్ కస్టమర్ ఫేసింగ్ రోల్స్ కింద దాదాపు 26,000 మంది ఐబీఎంలో  పనిచేస్తున్నట్లు సీఈవో అరవింద్ కృష్ణ  వెల్లడించారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ద్వారా దాదాపు 30 శాతం ఉద్యోగాలు తగ్గుతాయని  భావిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో దాదాపు 7,800 ఉద్యోగాలు పోతాయన్నారు.  కస్టమర్ కేర్ సర్వీసెస్, కోడింగ్ వంటి ఉద్యోగాలను  ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టూల్స్ ఆక్రమిస్తాయని వెల్లడించారు. 

ప్రస్తుతం ఐబీఎంలో 2లక్షల 60వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. తాజాగా ఆర్ధికమాంద్యం ఎఫెక్ట్‌ తో పలువురు ఉద్యోగులను కంపెనీ తీసేసింది. ఆ తర్వాత మళ్లీ రిక్రూట్‌మెంట్ చేయలేదు. దీంతో రానున్న రోజుల్లో ఉద్యోగుల స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలకు బలం చేకూరింది.

ఖర్చులను తగ్గించుకోవాలన్న ఉద్దేశంలో భాగంగా  అమెజాన్ వంటి అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వారి స్థానంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ కంపెనీ ఏప్రిల్ నెలలో 9వేల మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో పాటు..ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ మరోసారి ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 5 శాతం సమానమైన 3వేల మందిని తీసేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.