హైదరాబాద్, వెలుగు: క్లయింట్లకు మరింత వేగంగా సర్వీసులను అందించడానికి హైదరాబాద్‌లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించామని ఐబీఎం కన్సల్టింగ్ ప్రకటించింది. ఈ కొత్త సెంటర్ ఫైనాన్స్, అకౌంట్స్, ప్రొక్యూర్‌మెంట్, సప్లై చైన్, హ్యూమన్ రిసోర్సెస్, రిక్రూటింగ్ లాంటి పలు రంగాల్లో బిజినెస్ ప్రాసెస్ ఆపరేషన్లు నిర్వహిస్తుంది. వీటితోపాటు ఇండస్ట్రీకి అవసరమయ్యే రిస్క్, కాంప్లియెన్స్ పనులను కూడా చూస్తుంది. ఈ కేంద్రం ద్వారా తమ క్లయింట్ల డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ టార్గెట్లను సాధించడానికి సాయపడతామని కంపెనీ తెలిపింది. ఇందుకోసం తమ రీ–ఇంజినీరింగ్, డేటా, టెక్నాలజీలలో ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకుంటామని పేర్కొంది. క్లయింట్లతో కలసి పనిచేయడానికి ఈ సెంటర్లో ‘ఐబీఎం గ్యారేజీ ’ పేరుతో వర్క్ స్పేస్ లను కూడా ఏర్పాటు చేసింది. చెన్నై, బెంగళూరులోని బిజినెస్ ప్రాసెస్ ఆపరేషన్స్ సెంటర్లకు ఈ సెంటర్ బ్యాకప్ సైట్‌లా పనిచేస్తుంది. క్లయింట్ ఆపరేషన్ల కోసం ఏఐ, ఫ్లాట్ ఫారం సేవలను అందించడానికి ఆన్‌సైట్ టీమ్ హైదరాబాద్ లోని ఐబీఎం ఇండియా సాఫ్ట్ వేర్ ల్యాబ్స్ తో కలసి పనిచేస్తుంది.
ఉపాధి పెంచుతాం
ఈ సందర్భంగా ఐబీఎం కన్సల్టింగ్ బిజినెస్ ప్రాసెస్ ఆపరేషన్స్ గ్లోబల్ మేనేజింగ్ పార్టనర్ టోనీ మెనెజెస్ మాట్లాడుతూ, “డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను వేగవంతం చేయడానికి, క్లయింట్ల హైబ్రిడ్ క్లౌడ్ ఏఐ సామర్థ్యాలను పెంచడానికి ఐబీఎం కన్సల్టింగ్ కట్టుబడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా మా బిజినెస్ ప్రాసెస్ ఆపరేషన్స్ పోర్ట్ ఫోలియో బాగా పెరుగుతోంది. తెలంగాణలో ట్యాలెంట్‌కు కొరత లేదు. మా టీమ్ స్కిల్స్‌తో కంపెనీలకు మరింత మెరుగైన సేవలు అందిస్తాం. ఉపాధిని పెంచుతాం’’ అని చెప్పారు. ఐబీఎం కన్సల్టింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా 1.40 లక్షల మంది పనిచేస్తున్నారు. 150కి పైగా దేశాలలో ఆఫీసులు ఉన్నాయి. మనదేశంలో బెంగళూరు, గురుగ్రామ్, నోయిడా, చెన్నై, పూణే, మైసూరు ముంబై సిటీలలో ఐబీఎం కన్సల్టింగ్ బిజినెస్ ప్రాసెస్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది.