ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 896 స్పెషలిస్ట్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గతంలో బ్యాంకుకు సంబంధించిన అన్ని పనులనూ ప్రొబేషనరీ ఆఫీసర్లే చేసేవారు. లోన్లు, అకౌంట్స్, క్యాష్, అడ్మినిస్ట్రేషన్ విధులన్నీ నిర్వర్తించేవారు. ఇప్పుడు ప్రతి విభాగంలోనూ స్పెషలైజ్డ్ ఆఫీసర్లను నియమిస్తున్నారు. ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, సెలెక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం.
ప్రిలిమ్స్ అర్హత పరీక్షగా ఉంటుంది. మెయిన్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. 80:20 నిష్పత్తిలో మార్కులను లెక్కిస్తారు. లా, రాజ్‌భాష అధికారి పోస్టులకు పరీక్ష విధానం ఒకేలా ఉంటుంది. మిగిలిన నాలుగు పోస్టులకు మరో విధానం ఉంటుంది. ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సబ్జెకుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. లా ఆఫీసర్, రాజ్‌భాష అధికారి పోస్టులకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ స్థానంలో జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది. మెయిన్ పరీక్షలో ప్రశ్నలన్నీ సంబంధిత సబ్జెకులకు సంబంధించినవే ఉంటాయి. అవన్నీ గ్రాడ్యుయేషన్ స్థాయిలో విద్యార్థులు చదివిన సబ్జెక్టులే కాబట్టి ప్రిలిమ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి.
సిలబస్ అండ్ టిప్స్
రీజనింగ్ ఎబిలిటీ: ఈ విభాగంలో ప్రశ్నలు లాజికల్‌గా ఆలోచించి రాసేలా ఉంటాయి. క్వశ్చన్ ప్యాటర్న్ విశ్లేషిస్తే దాదాపు సమాధానం రాబట్టవచ్చు. నాలుగైదు సంవత్సరాలకు చెందిన అన్ని బ్యాంకు ప్రీవియస్ పేపర్లలో ఇచ్చిన ప్రశ్నలను, వాటి మెథడ్స్ ప్రాక్టీస్ చేయాలి. సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్, స్టేట్మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్, కోడింగ్–డీకోడింగ్, డైరెక్షన్స్ అనే 5 టాపిక్‌ల నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఆయా టాపిక్‌ల్లో ఉన్న అన్ని మోడల్స్, మెథడ్స్ చదవాలి.
వీటితో పాటు అనాలజీ, క్లాసిఫికేషన్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, నంబర్ టెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్ వంటి వర్బల్ రీజనింగ్ టాపిక్స్ పై దృష్టి పెట్టాలి. కోర్సెస్ ఆఫ్ యాక్షన్, ఇన్‌పుట్, అవుట్‌పుట్, కాజ్ అండ్ ఎఫెక్ట్, స్టేట్‌మెంట్-ఇన్‌ఫరెన్స్, మిర్రర్ ఇమేజస్, వాటర్ ఇమేజస్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కట్టింగ్, ప్యాటర్న్ కంప్లీషన్, ఎంబెడ్డెడ్ ఫిగర్స్ వంటి నాన్‍వర్బల్ రీజనింగ్ అంశాలు ప్రాక్టీస్ చేయాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సిన సబ్జెక్ట్ ప్రిపరేషన్ సమయంలో ఫార్ములాలు, షార్ట్‌కట్స్ రాసుకొని సాధన చేస్తే తక్కువ సమయంలో ఆన్సర్ చేయచ్చు. ఈ విభాగంలో గత పరీక్షల్లో ఎక్కువగా నంబర్ సిరీస్, డేటా సఫీషియన్సీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ టాపిక్‌ల నుంచి ప్రశ్నలిచ్చారు. కాబట్టి వీటిపై ఫోకస్ చేయడం ఎంతో అవసరం. అర్థమెటిక్ అంశాలైన పర్సెంటేజెస్, నిష్పత్తులు, లాభనష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ రూల్స్ పై పట్టు సాధించాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి. నంబర్ సిరీస్, నంబర్ సిస్టం, సింప్లిఫికేషన్స్, ఎల్‍సీఎం, హెచ్‍సీఎం, రూట్స్ అండ్ క్యూబ్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, ప్లాబ్లమ్స్ ఆన్ ఏజెస్, పని–కాలం, పని–దూరం, ట్రైన్స్ లో అన్ని మోడల్స్ చదవాలి.
జనరల్ అవేర్‌నెస్: ఈ విభాగంలో బ్యాంకింగ్ రిలేటెడ్ జనరల్ అవేర్‌నెస్ టాపిక్‌ల మీద దృష్టి పెట్టాలి. ఇండస్ర్టీలో వస్తున్న తాజా మార్పులు, ఫైనాన్షియల్ మార్కెట్స్, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్, బ్యాంకస్యూరెన్స్, లెటర్ ఆఫ్ క్రెడిట్, మనీ మార్కెట్స్, మనీ ఫంక్షన్స్ అండ్ టైప్స్, బ్యాంక్ లోన్స్ అండ్ డిపాజిట్స్, పథకాలు, టైప్స్ ఆఫ్ అకౌంట్స్, క్యాపిటల్ అండ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, పి నోట్స్, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్, స్ర్టక్చర్ ఆఫ్ బ్యాంకింగ్, రీటెయిల్ బ్యాంకింగ్, బ్యాంక్ టెర్మ్స్, బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ సంస్థలు, ఆర్బీఐ, నాబార్డ్, బ్యాంకింగ్ కమిటీలు, మ్యూచ్‌వల్ ఫండ్స్, ఈ పేమెంట్ సిస్టమ్స్ వంటి టాపిక్‌ల నుంచి ప్రశ్నలిస్తారు. ఇందుకు ఏదైనా స్టాండర్డ్ పుస్తకం ప్రిపేరవ్వాలి. బిజినెస్ పుస్తకాలు, పీరియాడికల్స్, మేగజీన్స్ చదవడం వల్ల బ్యాంకింగ్ నాలెడ్జ్ పెరుగుతుంది. ఇందులో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి కూడా ప్రశ్నలొచ్చే అవకాశం ఉంది.
ఇంగ్లీష్ లాంగ్వేజ్: పెద్ద పెద్ద వ్యాసాలు వేగంగా చదివి అర్థం చేసుకోగలిగితే అత్యధిక మార్కులు పొందగలిగే సబ్జెక్ట్ ఇంగ్లీష్ అని చెప్పవచ్చు. ప్యాసేజ్ ఆధారంగా దాదాపు 10 ప్రశ్నలిస్తారు కాబట్టి అందులోని సారాంశంను తెలుసుకుంటే అన్ని మార్కులు మీవే. ప్యాసేజ్‌లోని కష్టమైన పదాలకు అర్థాలు తెలిస్తే సినానిమ్స్, ఆంటోనిమ్స్, ఇడియమ్స్ వంటి ప్రశ్నలకూ సమాధానాలు రాయవచ్చు. న్యూస్‌పేపర్స్, చానళ్లలో ఉపయోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిని పరిశీలించాలి.
ప్రిలిమ్స్: ఇది కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. దీనిలో వచ్చిన మార్కులను ఫైనల్ మెరిట్లో కలపరు. నోటిఫికేషన్లో పేర్కొన్న లా ఆఫీసర్, రాజ్యభాష అధికారి పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, బ్యాంకింగ్ రంగానికి సంబంధించి జనరల్ అవేర్‌నెస్ ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు-25 మార్కులకు, రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులకు, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులకు మొత్తం 125 ప్రశ్నలకు గానూ 150 మార్కులకు పరీక్ష ఉంటుంది.
ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత ఉంటుంది. ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
మెయిన్స్: ప్రిలిమినరీ పరీక్షలో మినిమం కటాఫ్ మార్కులు పొందిన వారిని మెయిన్‌కు షార్ట్‌లిస్ట్ చేస్తారు. రాజ్యభాష అధికారి పోస్టుకు నిర్వహించే మెయిన్ పరీక్షలో ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ తరహాలో ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌లో 45 ప్రశ్నలు, డిస్క్రిప్టివ్‌లో 2 ప్రశ్నలు వస్తాయి. రెండింటికీ కలిపి 60 మార్కులు కేటాయించారు.
ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షలకు 30 నిమిషాల చొప్పున డ్యూరేషన్ ఉంటుంది.లా ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంశం నుంచి 60 ప్రశ్నలు- వస్తాయి. మొత్తం 60 మార్కులు కేటాయించారు . డ్యూరేషన్ 45 నిమిషాలు. ప్రిలిమినరీ, మెయిన్ ఆబ్జెక్టివ్పరీక్షల్లో ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత ఉంటుంది.
నోటిఫికేషన్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 896 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పోస్టులు: మొత్తం 896 పోస్టుల్లో ఐటీ ఆఫీసర్ (స్కేల్-1): 170, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్(స్కేల్-1): 346, రాజ్‌భాష అధికారి (స్కేల్-1): 25, లా ఆఫీసర్ (స్కేల్-1): 125, హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1): 25, మార్కెటింగ్ ఆఫీసర్(స్కేల్-1): 205 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పోస్టును అనుసరించి బీఈ, బీటెక్. డిగ్రీ, పీజీ, ఎంబీఏ చేసి ఉండాలి. వయసు 1ఆగస్టు 2024 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు రూ.850 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175) చెల్లించాలి. ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు అక్టోబర్‌లో రిలీజ్ చేస్తారు.
పరీక్ష నవంబర్‌లో ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ డిసెంబర్లో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ఫిబ్రవరి/మార్చి 2025లో ఉంటుంది. వివరాలకు www.ibps.in వెబ్సైట్లో సంప్రదించాలి.
ఇంటర్వ్యూ: మెయిన్స్‌కు హాజరైన అభ్యర్థులందరినీ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూకి 100 మార్కులు కేటాయించారు. మెయిన్, ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు.