
ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, లా తదితర ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్(ఎస్‌వో) నోటిఫికేషన్ చక్కటి అవకాశం. వివిధ విభాగాల్లో మొత్తం 1402 ఎస్‌వో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిసెంబర్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైతే బ్యాంకింగ్ రంగంలో ఉజ్వల కెరీర్ ఖాయం. ఈ నేపథ్యంలో ఎస్‌వో పోస్టుల వివరాలు, ఎంపిక ప్రక్రియ, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ గురించి తెలుసుకుందాం..
మూడంచెల్లో నిర్వహించే స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు పక్కా ప్లాన్‌తో ప్రిపేర్ అయితే కొలువు సాధించడం సులువు అవుతుంది. ముఖ్యంగా సిలబస్‌లో ఇచ్చిన అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ప్రాక్టీస్ చేయాలి. మ్యాథ్స్, ఇంగ్లీష్‌తో పాటు స్పెషల్‌గా ఉన్న సబ్జెక్టులపై ఫోకస్ చేయాలి.
పోస్టులు: అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్–1): 500, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్(స్కేల్–1): 31 , ఐటీ ఆఫీసర్ (స్కేల్–1): 120, లా ఆఫీసర్ (స్కేల్–1): 10, మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్–1): 700, రాజ్‌భాష అధికారి (స్కేల్–1): 41 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మెయిన్స్: ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ చూపి, నిర్దేశిత మెరిట్ జాబితాలో నిలిచిన వారికి రెండో దశలో మెయిన్ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. రాజ్ బాష అధికారి పోస్ట్‌కు, ఇతర పోస్ట్‌లకు వేర్వేరు విధానాల్లో రాత పరీక్ష ఉంటుంది. వివరాలు..
రాజ్ భాష అధికారి మెయిన్స్: ఇందులో ప్రొఫెషనల్ నాలెడ్జ్ 45 ప్రశ్నలు–పరీక్ష సమయం 30 నిమిషాలు. అదేవిధంగా ప్రొఫెషనల్ నాలెడ్జ్(డిస్క్రిప్టివ్ పరీక్ష)లో 2 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 30 నిమిషాలు. రెండు విభాగాలకు సంబంధించి మొత్తం 60 మార్కులకు పరీక్ష ఉంటుంది. డిస్క్రిప్టివ్ విభాగానికి సంబంధించి అభ్యర్థులు ఇంగ్లీష్ లేదా హిందీ మీడియంలో ఒక ఎస్సే రైటింగ్, ఒక లెటర్ రైటింగ్ రాయాలి.
ఇతర పోస్ట్‌లకు మెయిన్ ఎగ్జామ్: ఐటీ ఆఫీసర్, లా ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్ట్‌లకు నిర్వహించే మెయిన్ ఎగ్జామినేషన్‌లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ పరీక్ష 60 ప్రశ్నలు–60 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్ మార్కింగ్ ఉంది.
పర్సనల్ ఇంటర్వ్యూ: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి చివరగా 100 మార్కులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో అభ్యర్థులకు బ్యాంకింగ్ రంగంపై ఉన్న ఆసక్తి, ఈ రంగంలో తాజా పరిణామాలపై అవగాహన, వ్యక్తిగత దృక్పథం, వైఖరి వంటి అంశాలను పరిశీలిస్తారు.
సిలబస్ అండ్ టిప్స్
రీజనింగ్ ఎబిలిటీ: ఈ విభాగంలో ప్రశ్నలు లాజికల్‌గా ఆలోచించి రాసేలా ఉంటాయి. క్వశ్చన్ ప్యాటర్న్ విశ్లేషిస్తే దాదాపు సమాధానం రాబట్టవచ్చు. నాలుగైదు సంవత్సరాలకు చెందిన అన్ని బ్యాంకు ప్రీవియస్ పేపర్లలో ఇచ్చిన ప్రశ్నలను, వాటి మెథడ్స్‌ను సాధన చేయడం వల్ల మోడల్స్ పై అవగాహన పెరుగుతుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్, స్టేట్మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్, కోడింగ్–డీకోడింగ్, డైరెక్షన్స్ అనే 5 టాపిక్‌ల నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. వీటితో పాటు అనాలజీ, క్లాసిఫికేషన్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, నంబర్ టెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్ వంటి వర్బల్ రీజనింగ్ టాపిక్స్ పై దృష్టి పెట్టాలి. స్టేట్‌మెంట్-ఇన్‌ఫరెన్స్, మిర్రర్ ఇమేజస్, వాటర్ ఇమేజస్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కట్టింగ్, ప్యాటర్న్ కంప్లీషన్, ఎంబెడ్డెడ్ ఫిగర్స్ వంటి నాన్‍వర్బల్ రీజనింగ్ అంశాలు ప్రాక్టీస్ చేయాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ప్రాక్టీస్ అమితంగా అవసరం అయ్యే సబ్జెక్టు ఇది. ప్రీవియస్ పేపర్లలో వచ్చిన మోడల్స్‌ను బాగా సాధన చేయాలి. గత పరీక్షల్లో ఎక్కువగా నంబర్ సిరీస్, డేటా సఫీషియన్సీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్,అర్థమెటిక్ టాపిక్‌ల నుంచి ప్రశ్నలిచ్చారు. అర్థమెటిక్ అంశాలైన పర్సెంటేజెస్, నిష్పత్తులు, లాభనష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ రూల్స్ పై పట్టు సాధించాలి. డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి. నంబర్ సిరీస్, నంబర్ సిస్టం, సింప్లిఫికేషన్స్, ఎల్‍సీఎం, హెచ్‍సీఎం, రూట్స్ అండ్ క్యూబ్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, ప్లాబ్లమ్స్ ఆన్ ఏజెస్, పని–కాలం, పని–దూరం, ట్రైన్స్ లో అన్ని మోడల్స్ ప్రాక్టీస్ చేయాలి.
ఇంగ్లీష్ లాంగ్వేజ్: పెద్ద పెద్ద వ్యాసాలు వేగంగా చదివి అర్థం చేసుకోగలిగితే అత్యధిక మార్కులు పొందగలిగే సబ్జెక్ట్ ఇంగ్లీష్ అని చెప్పవచ్చు. ప్యాసేజ్ ఆధారంగా దాదాపు 10 ప్రశ్నలిస్తారు కాబట్టి అందులోని సారాంశంను తెలుసుకుంటే అన్ని మార్కులు మీవే. ప్యాసేజ్‌లోని కష్టమైన పదాలకు అర్థాలు తెలిస్తే సినానిమ్స్, ఆంటోనిమ్స్, ఇడియమ్స్ వంటి ప్రశ్నలకూ సమాధానాలు రాయవచ్చు. ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ రీ ఎరేంజ్‌మెంట్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, అంటోనిమ్స్, సినానిమ్స్ వంటి టాపిక్స్ నుంచి సెపరేట్‌గా మూడు నుంచి ఐదు ప్రశ్నలొచ్చే అవకాశం ఉంది.
అగ్రికల్చర్: స్పెషలిస్ట్ ఆఫీసర్లు అగ్రికల్చర్ లోన్లు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి పథకాలు, ఇన్సూరెన్స్ స్కీమ్స్, క్రాప్ సీజన్స్, అగ్రికల్చర్ స్కీమ్స్, మార్కెటింగ్ తదితర కార్యాకలాపాల్లో రైతులకు సహకరించాలి కాబట్టి బ్యాంకులో ఈ విధులకు సంబంధించిన ప్రశ్నలతో పాటు నిత్యం ఇండస్ర్టీ అప్‌డేట్స్ తెలుసుకుంటూ ప్రిపేరయితే మంచిది.
మార్కెటింగ్: బ్యాంక్ సర్వీస్‌లను వినియోగదారులకు చేరవేసే మార్కెటింగ్ విధానాలు, కస్టమర్లను ఆకట్టుకునే పథకాలు, బ్యాంక్‌లో లభిస్తున్న సర్వీసులు–ఉపయోగాలు వంటి వాటిని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. రూరల్ ఏరియాల్లో వినియోగించాల్సిన మార్కెటింగ్ స్ర్టాటజీస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. బ్యాంకింగ్ ఇండస్ర్టీలో వస్తున్న మార్పులు, లేటెస్ట్ డెవలప్మెంట్స్ గమనించాలి. అకడమిక్ టాపిక్స్ అయిన ఇంట్రడక్షన్ టు మార్కెటింగ్, స్ర్టాటజీస్, ప్లానింగ్, మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్, కన్స్యూమర్ బిహేవియర్, బి2బి మార్కెటింగ్, సర్వీస్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్, బ్రాండింగ్, మార్కెటింగ్ చానల్స్, అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, 4పీస్ ఆఫ్ మార్కెటింగ్, సేల్స్ ప్రమోషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, పర్సనల్ సెల్లింగ్ వంటి టాపిక్‌ల నుంచి ప్రొఫెషనల్ నాలెడ్జ్‌ను పరీక్షించేలా ప్రశ్నలు వస్తాయి.
లా: బ్యాంకింగ్ చట్టాలు, నెగోషియబుల్ ఇన్‌స్ర్టుమెంట్స్ యాక్ట్స్, అగ్రికల్చర్ చట్టాలతో పాటు వినియోగదారుల చట్టాలు, ఇన్సూరెన్స్ చట్టాలు, పోరమ్స్, కంపెనీ యాక్ట్, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్, మనీలాండరింగ్ యాక్ట్, ఐటీ చట్టం 2000, ఫారెన్ ఎక్స్చేంజ్ యాక్ట్, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ, టైప్స్ అఫ్ కంపెనీస్, పార్ట్నర్షిప్ యాక్ట్ వంటి లా రిలేటెడ్ అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
జనరల్ అవేర్‌నెస్
ఈ విభాగంలో బ్యాంకింగ్ రిలేటెడ్ జనరల్ అవేర్‌నెస్ టాపిక్‌ల మీద దృష్టి పెట్టాలి. ఇండస్ట్రీలో వస్తున్న తాజా మార్పులు, ఫైనాన్షియల్ మార్కెట్స్, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్, బ్యాంక్ అస్యూరెన్స్, లెటర్ ఆఫ్ క్రెడిట్, మనీ మార్కెట్స్, మనీ ఫంక్షన్స్ అండ్ టైప్స్, బ్యాంక్ లోన్స్ అండ్ డిపాజిట్స్, పథకాలు, టైప్స్ ఆఫ్ అకౌంట్స్, క్యాపిటల్ అండ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, పి నోట్స్, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్, స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్, రీటెయిల్ బ్యాంకింగ్, బ్యాంక్ టెర్మ్స్, బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ సంస్థలు, ఆర్బీఐ, నాబార్డ్, బ్యాంకింగ్ కమిటీలు, మ్యూచ్‌వల్ ఫండ్స్, ఈ పేమెంట్ సిస్టమ్స్ వంటి టాపిక్‌ల నుంచి ప్రశ్నలిస్తారు. ఇందుకు ఏదైనా స్టాండార్డ్ పుస్తకం ప్రిపేరవ్వాలి. బిజినెస్ పుస్తకాలు, పీరియాడికల్స్, మేగజీన్స్ చదవడం వల్ల బ్యాంకింగ్ నాలెడ్జ్ పెరుగుతుంది.
ప్రిలిమ్స్
ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్ష లా ఆఫీసర్,రాజ్ భాష అధికారి పోస్ట్‌లకు, ఇతర పోస్ట్‌లకు వేర్వేరు విధానాల్లో ఉంటుంది. పరీక్షలు పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మినహా మిగతా విభాగాలకు ఇంగ్లిష్ లేదా హిందీ మీడియంలలో హాజరుకావచ్చు.
లా ఆఫీసర్, రాజ్ భాష అధికారి ప్రిలిమినరీ: ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50ప్రశ్నలు–25 మార్కులు, రీజనింగ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ 50 ప్రశ్నలు–50 మార్కులు.. ఇలా మొత్తం 150 ప్రశ్నలు–125 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు.
ఇతర పోస్ట్‌లకు ప్రిలిమినరీ ఎగ్జామ్: ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్ట్‌లకు నిర్వహించే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వివరాలు..ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు–25 మార్కులు, రీజనింగ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు 50 మార్కులు.. ఇలా మొత్తం 150 ప్రశ్నలు–125 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు.
‑ వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్