Champions Trophy 2025: ఇంగ్లాండ్‌పై ఒక్కడే వీరంగం: భారీ సెంచరీతో రికార్డుల వర్షం కురిపించిన జద్రాన్

Champions Trophy 2025: ఇంగ్లాండ్‌పై ఒక్కడే వీరంగం: భారీ సెంచరీతో రికార్డుల వర్షం కురిపించిన జద్రాన్

ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ రికార్డ్ సెంచరీతో అదరగొట్టాడు. బౌండరీలతో లాహోర్ స్టేడియాన్ని హోరెత్తించాడు. సహచర బ్యాటర్లు విఫలమవుతున్నా ఒంటరి పోరాటం చేసి ఆఫ్ఘన్ జట్టును ముందుండి నడిపించాడు. 106 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న ఈ ఆఫ్ఘన్ ఓపెనర్.. ఓవరాల్ గా 146 బంతుల్లో 177 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. జద్రాన్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లతో పాటు 6 సిక్సర్లు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ మొత్తం స్కోర్ లో సగానికి పైగా పరుగులు ఇబ్రహీం బ్యాట్ నుంచే రావడం విశేషం. 

ఇబ్రహీం సెంచరీతో ఇంగ్లాండ్ ముందు ఆఫ్ఘనిస్తాన్ భారీ టార్గెట్ సెట్ చేసింది. తన సూపర్ ఇన్నింగ్స్ తో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ తరపున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో తన పేరిట ఉన్న 162 పరుగుల రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఇదే ఛాంపియన్స్ ట్రోఫీలో 165 పరుగుల చేరిన రికార్డును బద్దలు కొట్టాడు. 

ఆఫ్ఘనిస్తాన్ తరపున ఐసీసీ ఈవెంట్స్ లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా సరికొత్త రికార్డ్ సృష్టించాడు. జద్రాన్ ఆకాశమే హద్దుగా  చెలరేగి భారీ సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓమర్జాయ్(41), షాహిదీ(40), నబీ (40) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్ స్టోన్ రెండు వికెట్లు తీసుకున్నాడు.