ఆన్​లైన్​ గేమ్స్, బెట్టింగ్స్ కు బానిసలై.. ఒంటరి మహిళలే టార్గెట్​గా చోరీలు

ఆన్​లైన్​ గేమ్స్, బెట్టింగ్స్ కు బానిసలై.. ఒంటరి మహిళలే టార్గెట్​గా చోరీలు
  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో  బీటెక్​ స్టూడెంట్​, మెడికల్​ షాప్​ వర్కర్ అరెస్ట్
  • 6 తులాల గోల్డ్, కారు స్వాధీనం 

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఆన్​లైన్ గేమ్స్, బెట్టింగ్స్ కు బానిసలై ఈజీ మనీ కోసం చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని ఇబ్రహీపట్నం పోలీసులు పట్టుకున్నారు. 6 తులాల బంగారు ఆభరణాలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ కేపీవీ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెంకు చెందిన ఊటుకూరి ప్రభాస్(20) బీటెక్​స్టూడెంట్.

ఇతను కొంతకాలంగా అబ్దుల్లాపూర్​మెట్​లో ఉంటున్నాడు. ఆన్​లైన్ బెట్టింగ్స్ లో డబ్బు పోగొట్టుకున్నాడు. నల్గొండ జిల్లా శాలిగౌరారం గ్రామానికి చెందిన గుండ్లపల్లి శివ(19) మెడికల్​ షాపులో వర్కర్. ఇతను కూడా ఆన్​లైన్​ బెట్టింగ్స్, గేమ్స్​ ఆడి నష్టపోయారు.  వీరిద్దరూ ఇన్​స్టాగ్రామ్​లో ఫ్రెండ్స్. ఈజీ మనీ కోసం చోరీలు ప్లాన్ ​చేశారు. 

ఒంటరిగా ఉంటున్న మహిళలు, వృద్ధుల ఇండ్లను గుర్తించడం మొదలుపెట్టారు. ఈ నెల 10న ఓ కారును కిరాయికి తీసుకుని కందుకూరు మండలం ఆకుల మైలారం చేరుకున్నారు. ఒంటరిగా ఉంటున్న దేవరశెట్టి సుమతమ్మ ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె ఒంటిపై ఉన్న 6 తులాల బంగారు ఆభరణాలు(4 గాజులు, రెండు తులాల పుస్తెల తాడు) గుంజుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన గ్రీన్ ఫార్మా సిటీ పోలీసులు ప్రభాస్, శిను అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసి ఆభరణాలు, కారు, ఐ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.