
- మహేశ్వరం పోలీసులను వేడుకున్న అన్నదమ్ములు
ఇబ్రహీంపట్నం, వెలుగు: మా కుటుంబం కష్టాల్లో ఉంది.. ఇంట్లో అన్నం కూడా లేదు.. పని చేసుకునేందుకు అనుమతివ్వండి సారూ..!’ అంటూ అన్నదమ్ములు కలిసి పోలీసులను వేడుకున్నారు. దీంతో పోలీసులు ఆ కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సాన్ పల్లికి చెందిన బైరమోని శేఖర్, లక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు. కాగా.. గతేడాది దంపతులిద్దరూ రోడ్డు ప్రమాదానికి గురై మంచానికే పరిమితమయ్యారు. కుటుంబ పరిస్థితుల కారణంగా పదేండ్ల పెద్ద కొడుకు శివ పని కోసం వెతికాడు.
తమ కుటుంబం తినడానికి కూడా ఇబ్బంది పడుతోందని, ఏదైనా పని ఇవ్వాలని మహేశ్వరంలోని వ్యాపారులు, షాపుల వద్దకు వెళ్లి వేడుకున్నాడు. పోలీసులు అనుమతిస్తే పనికి పెట్టుకుంటామని సూచించారు. దీంతో శివ తన తమ్ముడితో కలిసి మహేశ్వరం పీఎస్కు వెళ్లి పోలీసులకు తమ పరిస్థితిపై వివరించారు. దీంతో మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ మధుసూదన్ ఆ కుటుంబానికి రూ.10 వేల నగదు, బియ్యం, నిత్యావసరాలు అందజేశారు. మైనర్లను పనులకు పంపవద్దని సూచించారు.