
- రెండో ర్యాంక్ సాధించిన విజయవాడ స్టూడెంట్
- సత్తా చాటిన పలువురు తెలుగు విద్యార్థులు
న్యూఢిల్లీ, వెలుగు: సీఏ ఇంటర్‌మీడియెట్, ఫౌండేషన్ పరీక్షల ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌం-టె-ట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆధ్వర్యంలో జనవరిలో ఈ పరీక్షలు నిర్వహించగా, ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. సీఏ ఇంటర్ 2025 పరీక్ష ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన దీపాన్షీ అగర్వాల్ 86.63 శాతం మార్కులతో ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ సాధించింది. మొత్తం 600 మార్కులకుగాను ఆమె 521 మార్కులు సాధించింది.
విజయవాడకు చెందిన తోట సోమనాథ్ శేషాద్రి నాయుడు 516 మార్కులతో 86 శాతం స్కోరు చేసి ఆల్ ఇండియా రెండో ర్యాంక్ దక్కించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌కి చెందిన సర్థాక్ అగర్వాల్ 515 మార్కులతో 85.83 శాతం స్కోర్ చేసి మూడో ర్యాంక్‌లో నిలిచాడు. గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించి, రెండు గ్రూపులకు కలిపి మొత్తం 48,261 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 6,781 మంది(14.05 శాతం)మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.
సీఏ ఇంటర్ గ్రూప్ 1లో మొత్తం 1,08,187 మంది పరీక్ష రాయగా 15,332 మంది (14.175 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇక గ్రూప్ 2లో 80,368 మంది పరీక్ష రాయగా.. 17,813 మంది (22.16 శాతం) పాస్ అయ్యారు. ఫౌండేషన్ పరీక్షలో 21.52 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా, సీఏ ఇంటర్‌మీడియెట్ గ్రూపు 1 పరీక్షలు జనవరి 11, 13, 15 తేదీల్లో నిర్వహించగా, గ్రూపు 2 పరీక్షలు జనవరి 17, 19, 21 తేదీల్లో జరిగాయి.
రెండు గ్రూప్‌ల వారికి జనవరి 12, 14, 16, 18 తేదీల్లో పరీక్షలు జరిగాయి. సీఏ ఫౌండేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి, అభ్యర్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 40 మార్కులు సాధించాలి. అలాగే ఓవరాల్ అగ్రిగేట్ 50 శాతం కనీస స్కోరు పొందాలి. మొత్తం 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్కోరు సాధించిన అభ్యర్థులే డిస్టింక్షన్‌తో ఉత్తీర్ణత హోదా పొందుతారు.