- వరంగల్ మెయిన్ సెంటర్, ఆదిలాబాద్లో సబ్ సెంటర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పత్తి పంటకు సంబంధించి రెండు అఖిల భారత సమన్వయ పత్తి పరిశోధన కేంద్రాలకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్) గ్రీన్ సిగ్నల్ ఇ చ్చింది. రెండు కేంద్రాలను మంజూరు చేస్తున్నట్లు అగ్రికల్చర్ వర్సిటీ వీసీకీ ఐకార్ అధికారికంగా లెటర్ రాసింది. ఇటీవల అగ్రికల్చర్ యూనివర్సిటీకి నూతనంగా నియమితులైన వీసీ, ప్రొఫెసర్ అల్థాస్ జానయ్య గత నెలలో ఢిల్లీలోని ఐకార్ డైరెక్టర్ జనరల్ హిమాన్షు పాఠక్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీపీ శర్మను కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణలో పత్తి పంట ప్రాధాన్యతను వివరించి వెంటనే అఖిలభారత పత్తి సమన్వయ పరిశోధన పథకంలో తమకు భాగస్వామ్యం కల్పించాలని కోరారు. వరంగల్లో మెయిన్ సెంటర్, ఆదిలాబాద్ లో సబ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా విన్నవించారు. దీనికి ఐకార్ డైరెక్టర్ జనరల్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సానుకూలంగా స్పందించారు. సెంటర్లను వెంటనే మంజూరు చేస్తున్నట్లు బుధవారం అధికారికంగా సమాచారం అందిస్తూ లెటర్ రాశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ రెండు ఏఐసీఆర్పీ కేంద్రాలలో పూర్తిస్థాయిలో పరిశోధనలు చేపట్టనున్నట్లు అల్థాస్ జానయ్య తెలిపారు.