ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ గ్రాండ్ గా ఆరంభించాలనుకున్న బీసీసీఐకి నిరాశే ఎదురైంది. వరల్డ్ కప్ తొలి మ్యాచు చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు. ఫలితంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వెలవెలబోయింది. దాదాపు లక్ష ముప్పై వేలకు పైగా సీటింగ్ ఉన్న ఈ స్టేడియం చాలా తక్కువ మంది ఈ మ్యాచ్ వీక్షించడానికి వచ్చారు.
ఇంగ్లాండ్-న్యూజీలాండ్ లాంటి పెద్ద జట్లు వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచుకు ఇంత తక్కువ మంది ప్రేక్షకులు రావడం ఆశ్చర్యం కలిగించింది. ఒక రకంగా ఇది వార్మప్ మ్యాచుని తలపించింది. భారత్ వేదికగా వరల్డ్ కప్ జరుగుతుండడంతో పండగ వాతావరణం నెలకొంది. ప్రతి మ్యాచుకు భారీ హైప్ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఊహించిందేమీ జరగలేదు. లక్ష 32 వేల సీటింగ్ సామర్ధ్యమున్న ఈ స్టేడియంలో కేవలం 3000-4000 మధ్యలో ప్రేక్షకులు వచ్చారని సమాచారం.
కేవలం 3 శాతం మంది గ్రౌండ్ లో ఈ మ్యాచుని చూడడడం షాక్ కి గురి చేస్తుంది. అహ్మదాబాద్ లో మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండడం కారణమని చెప్పుకొస్తున్నా.. క్రికెట్ ని అమితంగా ఇష్టపడే మన దేశంలో వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఇంత తక్కువమంది రావడం ఇదే తొలిసారి. ఇక భారత్ వస్తే గాని స్టేడియం మొత్తం నిండేలా కనిపించడం లేదు. మొత్తానికి తొలి రోజు అట్టర్ ఫ్లాప్ అయినా రాను రాను ఎలా ఉంటుందో చూడాలి.