అది 2022 టీ 20 ప్రపంచ కప్ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్.. 160 పరుగుల లక్ష్య చేధనలో 31 పరుగులకే నాలుగు వికెట్లు.. చివరి 8 బంతుల్లో 28 పరుగులు చేయాలి.. ఈ మ్యాచ్ లో ఇది భారత్ పరిస్థితి. భారత్ ఓడిపోతుందని సగటు భారత అభిమాని ఆశలు వదిలేసుకుంటున్నాడు. కానీ క్రీజ్ లో ఉంది ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ. ఏదైనా అద్భుతం జరగకపోదా అని అందరూ ఆశించారు. అనుకున్నట్లుగానే కోహ్లీ భారత్ ను ఈ మ్యాచ్ లో గెలిపించాడు.
8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన దశలో 19 వ ఓవర్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి భారత్ విజయంపై ధీమా పెంచాడు. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన దశలో అనేక నాటకీయ పరిణామాల మధ్య భారత్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. విరాట్ కు ఇలాంటి సంచలన ఇన్నింగ్స్ లు ఆడటం అలవాటే అయినా.. 19 వ ఓవర్ 5 వ బంతికి కోహ్లీ కొట్టిన సిక్సర్ మ్యాచ్ కే కాదు టోర్నీ మొత్తానికి హైలెట్ గా నిలిచింది. పాక్ పేసర్ హారిస్ రౌఫ్ బౌలింగ్ లో బాడీని బ్యాలన్స్ చేస్తూ లాంగాన్ మీదగా కోహ్లీ కొట్టిన ప్రపంచ క్రికెట్ ను విస్తు గొలిపింది.
క్రికెట్ లో ఎన్నో వినూత్నమైన షాట్స్ ఉన్నా ఈ షాట్ ప్రత్యేకం. ఈ షాట్ ను ఐసీసీ "షాట్ ఆఫ్ ది సెంచరీ" గా ప్రకటించింది. ఏకంగా ఐసీసీనే షాట్ ఆఫ్ ది సెంచరీగా ప్రకటించిందంటే ఈ షాట్ ఎంత మందికి నచ్చిందో మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం కోహ్లీ వరల్డ్ కప్ లో అదరగొడుతున్నాడు. ఆడిన 8 మ్యాచ్ ల్లో 543 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో కోహ్లీ డికాక్ తర్వాత స్థానంలో నిలిచాడు.