Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. హైబ్రిడ్ మోడల్‌కు ఐసీసీ ఆమోదం

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. హైబ్రిడ్ మోడల్‌కు ఐసీసీ ఆమోదం

ఛాంపియన్స్ ట్రోఫీ వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌ విధానంలో నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఆమోదం తెలిపింది. పీసీబీ, బీసీసీఐల మధ్య ఒప్పందం ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు పాకిస్థాన్, దుబాయ్‌లో జరగనున్నాయి. భారత జట్టు ఆడే మ్యాచ్‌లు దుబాయ్ లో జరగనుండగా.. మిగిలిన మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. భారత జట్టు నాకౌట్ పోరుకు అర్హత సాధిస్తే.. దుబాయ్‌లోనే సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు. ఒకవేళ టీమిండియా లీగ్ దశలోనే నిష్క్రమిస్తే, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు లాహోర్, రావల్పిండిలో జరుగుతాయి.

ఈ ఒప్పందానికి గానూ ఇరు దేశాల బోర్డులు 2026 టీ20 ప్రపంచ కప్‌పై ఏకాభిప్రాయానికి వచ్చాయి. 2026 టీ20 ప్రపంచకప్‌‌కి భారతదేశం ఆతిథ్యమివ్వనుండగా.. పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించదు. బదులుగా పొరుగు దేశం ఆడే మ్యాచ్‌లు కొలంబోలో జరగనున్నాయి. వివాదానికి ముగింపు పడటంతో ఐసీసీ త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను  అధికారికంగా ప్రకటించనుంది. వాస్తవానికి ఈ షెడ్యూల్‌ టోర్నీ ప్రారంభానికి 100 రోజుల ముందుగానే ప్రకటించాలి. కానీ భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా ఐసీసీ వాయిదా వేసింది.

మా జట్టును పాకిస్థాన్ పంపం..: బీసీసీఐ

భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ జట్టును పాకిస్థాన్‌కు పంపించలేమని బీసీసీఐ.. ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని.. తటస్థ వేదికపై ఆడేందుకు తాము సిద్ధమని స్పష్టం చేసింది. మొదట హైబ్రిడ్ మోడల్‌ విధానానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అంగీకరించనప్పటికీ, చివరకు ఒప్పుకోక తప్పలేదు.

ALSO READ : Pakistan Cricket: అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్థాన్ ఆల్‌రౌండర్ గుడ్ బై

హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించిన పీసీబీకి ఐసీసీ మరో ఆఫర్ కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 2027 తర్వాత జరిగే మహిళల ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులు దాయాది దేశానికి కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.