
న్యూఢిల్లీ : చాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో బీసీసీఐ కొత్త ట్రావెల్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. మెగా టోర్నీలో ఆడే టీమిండియా ప్లేయర్లు ఫ్యామిలీస్‌ను తీసుకెళ్లేందుకు అనుమతించడం లేదు. రేపు దుబాయ్ బయలుదేరనున్న ఇండియా టీమ్ 20న బంగ్లాదేశ్‌తో, 23న పాకిస్తాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఒకవేళ ఫైనల్‌కు చేరితే మార్చి 9న టైటిల్ ఫైట్ జరుగుతుంది. కాబట్టి మూడు వారాల్లోనే టోర్నీ ముగిసే అవకాశం ఉండటంతో ఫ్యామిలీస్‌ను తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు.
కొత్త పాలసీ ప్రకారం 45 రోజుల కంటే ఎక్కువగా సాగే టూర్లలో మాత్రమే ఫ్యామిలీస్‌తో రెండు వారాలు కలిసి ఉండేందుకు అవకాశం ఇచ్చారు. ‘ఏదైనా మార్పులు ఉంటే అది వేరే విషయం. ప్రస్తుతానికి ఈ టూర్‌కు ప్లేయర్లతో పాటు వారి భార్యలు లేదా భాగస్వాములు వచ్చే అవకాశం లేదు. సీనియర్ ఆటగాళ్లలో ఒకరు దీని గురించి విచారించారు. ఇది విధానపరమైన నిర్ణయమని బోర్డు అతనికి తెలిపింది. ఒకవేళ ఇతర కారణాలతో ఎవరైనా ప్లేయర్‌కు పర్మిషన్ ఇస్తే ఫ్యామిలీ ఖర్చులన్నీ అతనే భరించాల్సి ఉంటుంది’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఇండియా ఓడిపోవడంతో బోర్డు కొత్త ట్రావెల్ పాలసీని రూపొందించింది. ఈ పాలసీలోని మరికొన్ని రూల్స్ ఇప్పటికే అమల్లోకి వచ్చాయని సీనియర్ అధికారి తెలిపారు. ప్రాక్టీస్ కోసం ఏ ప్లేయర్ కూడా ప్రైవేట్ వెహికల్‌ను ఉపయోగించడం లేదన్నారు.
టీ20 సిరీస్ కోసం కోల్‌కతా చేరిన తర్వాత ప్లేయర్లందరూ టీమ్ బస్‌లోనే ప్రయాణించారని చెప్పారు. ఇక ప్లేయర్ల పర్సనల్ స్టాఫ్ (మేనేజర్లు, ఏజెంట్లు, చెఫ్)పై కూడా అంక్షలు విధించారు. వీళ్లకు టీమ్ బస చేసే హోటల్ కాకుండా వేరే దాన్ని కేటాయించనున్నారు. అలాగే ప్లేయర్ల ప్రత్యేక ఆహార అవసరాలను తీర్చడానికి కొంత మంది చెఫ్‌లను నియమించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది.