
ఐపీఎల్ కు ముందు అభిమానులను ఐసీసీ ట్రోఫీ అలరించనుంది. రేపటి నుంచి.. అనగా ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. కరాచీలోని నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యం ఇస్తుంది. పాకిస్తాన్,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లను రెండు గ్రూప్ లుగా విడగొట్టారు. గ్రూప్ ఏ లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బి లో ఉన్నాయి. భారత జట్టు ఉన్న గ్రూప్ ఏ రివ్యూ ఒకసారి చూద్దాం.
డిఫెండింగ్ ఛాంపియన్ గా పాకిస్థాన్ బరిలోకి దిగుతుంది. పైగా స్వదేశంలో టోర్నీ జరగబోతుంది. ఇంకేముంది పాకిస్థాన్ సెమీస్ కు చేరడం ఖాయమనుకుంటున్నారు. మరో వైపు ఐసీసీ టోర్నీల్లో అద్భుతంగా ఆడుతున్న భారత్ కూడా టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. అయితే ఈ రెండు జట్ల కన్నా న్యూజిలాండ్ బలంగా ఉందనే మాట వాస్తవం. ఫామ్ పరంగా చూసుకున్నా.. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా చూసుకున్నా అసలైన ఫేవరేట్ కివీస్.
ఛాంపియన్స్ ట్రోఫీ ముందు పాకిస్థాన్ లో జరిగిన ట్రై సిరీస్ కు ముందు వరకు న్యూజిలాండ్ జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. అయితే ట్రై సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి టైటిల్ గెలుచుకోవడంతో ఆ జట్టు ఒక్కసారిగా పాకిస్థాన్, భారత్ జట్లకు హెచ్చరికలు పంపింది. కివీస్ జట్టులో ప్రతి ఒక్కరు ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు అనుకూలాంశం. విలియంసన్, మిచెల్, కాన్వే లకు తోడు ఆ జట్టులో సాంట్నర్, రచీన్ రవీంద్ర, బ్రేస్ వెల్ రూపంలో ముగ్గురు సాలిడ్ ఆల్ రౌండర్లు ఉన్నారు. బౌలింగ్ లో కొత్త కుర్రాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా విలియంసన్ సూపర్ ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు కొండంత బలం.
పాకిస్థాన్ తో నేషనల్ కరాచీ స్టేడియంలో ట్రై సిరీస్ ఫైనల్లో పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించింది. మరోసారి అదే స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో కివీస్ స్పష్టంగా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. పాకిస్థాన్ జట్టుగా రాణించడం విఫలమవుతుంది. ఆ జట్టు కెప్టెన్ రిజ్వాన్, అఘా సల్మాన్ లపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. సొంతగడ్డపై అభిమానుల సపోర్ట్ ఉన్నా కివీస్ ను ఓడించడం శక్తికి మించిన పని. ఇక భారత్ పై న్యూజి లాండ్ కు ఐసీసీ టోర్నీల్లో అద్భుతమైన రికార్డ్ ఉంది. పైగా భారత్ కు దుబాయ్ లో ఆడిన అనుభవం లేదు. జట్టులో ఎవరు ఎప్పుడు ఆడతారో చెప్పలేని పరిస్థితి. దీంతో న్యూజిలాండ్ గ్రూప్ ఏ లో అగ్ర స్థానంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.