ICC Champions Trophy 2025: తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ ఢీ.. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రతిపాదిత షెడ్యూల్ విడుదల

ICC Champions Trophy 2025: తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ ఢీ..  ఛాంపియన్స్ ట్రోఫీ ప్రతిపాదిత షెడ్యూల్ విడుదల

పాకిస్తాన్ వేదికగా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఇప్పటికే దీనిపై ఐసీసీ స్పష్టతనిచ్చింది. పాకిస్తాన్‌‌లోనే ఈ టోర్నీ నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. ఈ మెగా టోర్నీ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారిక షెడ్యూల్ ఇంకా ఖరారు చేయనప్పటికీ.. ప్రతిపాదిత షెడ్యూల్ మాత్రం రిలీజ్ చేశారు. దీని ప్రకారం గ్రూప్ ఏ లో  పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్,న్యూజిలాండ్.. గ్రూప్ బి లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ ఈ మెగా టోర్నీ ఆడతాయి. 

ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్‌ను మూడు వేదికల్లో నిర్వహించాలని భావిస్తున్నారు. వీటిలో కరాచీ, రావల్పిండి, లాహోర్ ఉన్నాయి. ఈ టోర్నీ మొదటి మ్యాచ్ లో ఆతిథ్య పాకిస్థాన్‌తో న్యూజిలాండ్‌తో తలపడనుంది. భారత జట్టు లాహోర్ వేదికగా ఫిబ్రవరి 20 న బంగ్లాదేశ్ తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అందరూ ఎదరు చూస్తున్న భారత్, పాక్ మ్యాచ్ మార్చి 1న లాహోర్‌ వేదికగా తలపడనున్నట్లు తెలుస్తోంది.

భద్రతాపరమైన, రవాణా కారణాల వల్ల టీమిండియా గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లన్నిటిని లాహోర్‌లోని గడాఫీ స్టేడియంకు పరిమితం చేసినట్లు పీటీఐ నివేదికలో వెల్లడైంది. అయితే, ఈ టోర్నీకి భారత జట్టును పంపే విషయంలో బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. ఉగ్రవాదం, సరిహద్దు వివాదాల కారణంగా ఈ ఇరు జట్లు కేవలం ఐసీసీ, ఆసియా కప్ వంటి టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. పాక్ జట్టు భారత్ లో పర్యటిస్తున్నప్పటికీ.. భారత జట్టు దాయాది దేశానికి వెళ్లడం లేదు. ఉగ్రవాదాన్ని తుదిముట్టిస్తేనే భారత క్రికెట్ జట్టు.. పాక్ పర్యటనకు వస్తుందని ప్రభుత్వ వర్గాలు ఖరాఖండీగా చెప్తున్నాయి.

మొత్తం 20 రోజుల్లో ఈ టోర్నీ జరిపేందుకు ఐసీసీ ప్రయత్నాలు చేస్తుంది. కొన్ని రోజుల్లో ఐసీసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి ఐపీఎల్ జరగనుంది కాబట్టి ఈ క్యాష్ లీగ్ కు ముందే ఈ టోర్నీ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రపంచ లీగ్ లు తమ షెడ్యూల్ ను సైతం మార్చున్నట్టు తెలుస్తోంది. జనవరి 11 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లీగ్.. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 వరకు దక్షిణాఫ్రికా టీ20 లీగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.