Champions Trophy 2025: మరో ఐసీసీ ట్రోఫీకి ముహూర్తం ఖరారు.. ఐపీఎల్‌కు ముందే ఛాంపియన్స్ ట్రోఫీ

Champions Trophy 2025: మరో ఐసీసీ ట్రోఫీకి ముహూర్తం ఖరారు.. ఐపీఎల్‌కు ముందే ఛాంపియన్స్ ట్రోఫీ

ఒకప్పుడు ఐసీసీ టోర్నీల కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రతి ఏడాదికి ఒక ఐసీసీ టోర్నీ జరుగుతుంది. ప్రస్తుతం ఐసీసీ వెస్టిండీస్, అమెరికా వేదికలుగా టీ20 వరల్డ్ కప్ జరుగుతుండగా.. మరో ఐసీసీ టోర్నీ తేదీని ఐసీసీ ఖరారు చేసింది.   షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్ వేదికగా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఇప్పటికే దీనిపై ఐసీసీ స్పష్టతనిచ్చింది. పాకిస్తాన్‌‌లోనే ఈ టోర్నీ నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. తాజాగా ఈ మెగా టోర్నీ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు నిర్వహించనునున్నారని నివేదికలు తెలుపుతున్నాయి. 

మొత్తం 20 రోజుల్లో ఈ టోర్నీ జరిపేందుకు ఐసీసీ ప్రయత్నాలు చేస్తుంది. కొన్ని రోజుల్లో ఐసీసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి ఐపీఎల్ జరగనుంది కాబట్టి ఈ క్యాష్ లీగ్ కు ముందే ఈ టోర్నీ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రపంచ లీగ్ లు తమ షెడ్యూల్ ను సైతం మార్చున్నట్టు తెలుస్తోంది. జనవరి 11 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లీగ్.. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 వరకు దక్షిణాఫ్రికా టీ20 లీగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం అన్ని టీమ్ ఇండియా మ్యాచ్‌లకు లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంను వేదికగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ నిర్ణయాన్ని బీసీసీఐ ఒప్పుకుంటుందో లేదో ప్రస్తుతం చర్చనీయాంశయంగా మారింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కరాచీ, లాహోర్,రావల్పిండిలను వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి వేదికలుగా ప్రకటించింది.  పాకిస్థాన్ లో భారత్ పర్యటించనందున హైబ్రిడ్ మోడల్ లోనే ఈ టోర్నీ జరిగే అవకాశం కనిపిస్తుంది. చివరిసారిగా 2017 లో ఛాంపియన్స్ జరిగింది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్ పై పాకిస్థాన్ ఫైనల్లో గెలిచి టైటిల్ గెలుచుకుంది.