ప్రిటోరియా : చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని సౌతాఫ్రికా స్పోర్ట్స్ మినిస్టర్ బహిరంగంగా పిలుపునిచ్చారు. దీంతో దేశ ప్రజలకు మద్దతుగా నిలిచారు. ఐసీసీ తన సొంత రూల్స్‌ను పాటించడం లేదని విమర్శించారు. ‘తాలిబాన్ గవర్నమెంట్ మహిళల క్రీడలను నిషేధించింది. నేషనల్ విమెన్స్ క్రికెట్ టీమ్‌ను కూడా రద్దు చేసింది. అందుకే మేం అఫ్గాన్ విమెన్స్ క్రికెట్‌కు నైతికంగా మద్దతు ఇస్తున్నాం. అందులో భాగంగా అఫ్గాన్‌తో జరిగే మా మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని పిలుపు ఇస్తున్నాం.
ఫ్యూచర్‌లో అఫ్గాన్, సౌతాఫ్రికా మ్యాచ్‌లు జరగాలా? వద్దా? అనే అంశంపై తుది నిర్ణయం మా ప్రభుత్వం తీసుకుంటుంది. అఫ్గాన్‌లో మహిళలపై హింస ఇలాగే కొనసాగితే మ్యాచ్‌లు జరగడం కష్టమే. వర్ణ వివక్ష సమయంలో క్రీడా అవకాశాల్లో సమానమైన ప్రవేశం లేని జాతి నుంచి వచ్చిన వ్యక్తిగా నేను ఈ మాట చెబుతున్నా. ప్రపంచంలో ఎక్కడైనా మహిళల పట్ల వివక్ష కొనసాగుతున్నప్పుడు నేను స్పందించకపోవడం కపటత్వం, అనైతికం అవుతుంది’ అని స్పోర్ట్స్ మినిస్టర్ గేటన్ మెకెంజీ వ్యాఖ్యానించారు.