బంతిపైనే బెంగ .. చాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమైన టీమిండియా

బంతిపైనే బెంగ .. చాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమైన టీమిండియా
  • బ్యాటింగ్‌‌‌‌లో బలంగా రోహిత్‌‌‌‌సేన
  • బుమ్రా లేకపోవడంతో వీక్ అయిన బౌలింగ్‌‌‌‌
  • రేపటి నుంచే ఐసీసీ మెగా ఈవెంట్‌‌‌‌

(వెలుగు స్పోర్ట్స్ డెస్క్‌‌‌‌) ఎనిమిదేండ్ల విరామం తర్వాత అభిమానుల ముందుకొస్తున్న ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగుతోంది.12 ఏండ్ల కిందట ఈ మెగా టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు.. మరోసారి టైటిల్ నెగ్గడమే టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. వయసు, ఇటీవల పరిణామాల దృష్ట్యా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇదే చివరి ఐసీసీ టోర్నీ కానుంది. దాంతో మెగా ఈవెంట్‌‌‌‌లో ఈ ఇద్దరిపై ప్రత్యేక దృష్టి ఉండనుంది. 

గతేడాది టీ20 వరల్డ్ కప్‌‌‌‌ అందుకున్న రోకో జోడీ మరో ఐసీసీ ట్రోఫీని ముద్దాడితే  సగర్వంగా ఆట నుంచి నిష్ర్కమించవచ్చు. అది జరగాలంటే గురువారం మొదలయ్యే ఈ టోర్నీలో తమ మ్యాచ్‌లను  అరబ్ గడ్డపై ఆడనున్న టీమిండియా అన్ని విభాగాల్లోనూ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌‌‌‌లో మన జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ఇంగ్లండ్‌‌‌‌తో వన్డే సిరీస్‌‌‌‌లో 3–0తో గెలిచిన రోహిత్‌‌‌‌సేన.. టాప్‌‌‌‌, మిడిల్, లోయర్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటి ఈ టోర్నీకి సన్నద్ధమైంది. స్వదేశంలో న్యూజిలాండ్‌‌‌‌తో  టెస్టు సిరీస్ నుంచి పేలవంగా ఆడిన కెప్టెన్‌‌‌‌, ఓపెనర్ రోహిత్ ఇంగ్లండ్‌‌‌‌పై సెంచరీతో తిరిగి ఫామ్‌‌‌‌ అందుకున్నాడు. 

చివరి వన్డేలో ఫిఫ్టీతో కోహ్లీ కూడా టచ్‌‌‌‌లోకి రాగా.. మరో ఓపెనర్‌‌‌‌‌‌‌‌ శుభ్‌‌‌‌మన్ గిల్ సూపర్ ఫామ్‌‌‌‌లో ఉన్నాడు.  శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ రాకతో మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌ సమస్యకు పూర్తిగా పరిష్కారం దొరికింది. వీళ్లకు తోడు  ఆల్‌‌‌‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌, జడేజాతో బ్యాటింగ్ విభాగం బలంగా, లోతుగా మారింది. లెఫ్ట్‌‌‌‌–రైట్ కాంబినేషన్‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌లో ముందుగా వచ్చి సత్తా  చాటేందుకు అక్షర్ సిద్ధంగా ఉండటం మరో అడ్వాంటేజ్‌‌‌‌. అక్షర్‌‌‌‌‌‌‌‌, జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్‌‌‌‌, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ రూపంలో ఐదుగురు నాణ్యమైన స్పిన్నర్లు టీమ్‌‌‌‌ ఉన్నారు. దుబాయ్‌‌‌‌లో వికెట్లు స్పిన్‌‌‌‌కు అనుకూలిస్తే వీళ్లు మ్యాచ్‌‌‌‌లను మలుపు  తిప్పడం పక్కా అనొచ్చు.

బుమ్రాస్త్రం లేదు.. షమీపైనే పేస్ భారం

బ్యాటింగ్, స్పిన్‌‌‌‌ విషయంలో జట్టుకు తిరుగులేకపోయినా.. ఫాస్ట్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లోనే ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా  గాయం కారణంగా స్టార్ పేసర్ జస్‌‌‌‌ప్రీత్ బుమ్రా లేకపోవడం జట్టుకు అతి పెద్ద లోటు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌‌‌‌ నెగ్గడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. కొన్నేండ్లుగా తను బౌలింగ్‌‌‌‌ విభాగానికి వెన్నెముకగా మారాడు. ఎలాంటి పిచ్, వాతావరణంలో అయినా.. ప్రత్యర్థి బ్యాటర్లను వణికించే అస్త్రాలు తన  వద్ద ఉన్నాయి. కొత్త బాల్‌‌‌‌తో హడలెత్తించే జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ డెత్ ఓవర్లలో వేసే పదునైన యార్కర్లకు మేటి ఆటగాడైనా ఇబ్బంది పడాల్సిందే. 

జట్టుకు అవసరమైనప్పుడు వికెట్లు అందించడమే కాకుండా మిగతా బౌలర్లపై ఒత్తిడి తగ్గించి.. వారు స్వేచ్ఛగా ఆడేలా బుమ్రా సాయం చేయగలడు. అలాంటి అత్యంత కీలకమైన ‘బుమ్రాస్త్రం’ లేకుండా చాంపియన్స్ ట్రోఫీ వేటకు సిద్ధమైన బౌలింగ్ విభాగాన్ని నడిపించే బాధ్యత ఇప్పుడు సీనియర్ పేసర్ మహ్మద్ షమీపై ఉండనుంది. అనుభవం, నైపుణ్యం ఉన్నప్పటికీ గాయం కారణంగా 14 నెలల పాటు ఆటకు దూరమైన 34 ఏండ్ల  షమీ ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చాడు.

 దేశవాళీ క్రికెట్‌‌‌‌తో పాటు ఇంగ్లండ్‌‌‌‌తో రెండు టీ20లు, రెండు వన్డేల్లో బరిలోకి దిగాడు. కానీ, అత్యంత పోటీ, తీవ్ర ఒత్తిడి ఉండే చాంపియన్స్ ట్రోఫీలో రాణించడం అంత సులువైన విషయం కాదు. నిజానికి బుమ్రా రాకముందు జట్టు పేస్ బాధ్యతలను షమీనే మోశాడు. జస్‌‌‌‌ప్రీత్ స్టార్ బౌలర్‌‌‌‌‌‌‌‌గా మారిన తర్వాత కూడా వన్డే ఫార్మాట్‌‌‌‌లో సత్తా చాటాడు. 2019, 2023 వన్డే వరల్డ్ కప్స్‌‌‌‌లో బుమ్రాను మించిన పేస్ పదును చూపెట్టాడు. అయితే, జస్‌‌‌‌ప్రీత్ లేని సమయంలోనే ఇప్పుడు షమీపై గురుతర బాధ్యత ఉండనుంది. పేస్‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌గా బౌలింగ్‌‌‌‌ను ముందుకు నడిపించడంతో పాటు వన్డేల్లో అంతగా అనుభవం లేని అర్ష్‌‌‌‌దీప్ సింగ్‌‌‌‌, కొత్త కుర్రాడు హర్షిత్‌‌‌‌ రాణాతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.

సెకండ్ పేసర్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగనున్న అర్ష్‌‌‌‌దీప్  అమెరికా, వెస్టిండీస్‌‌‌‌ ఆతిథ్యం ఇచ్చిన గత టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ యూఎస్‌‌‌‌, కరీబియన్ వికెట్లతో పాలిస్తే దుబాయ్‌‌‌‌ పిచ్‌‌‌‌లు పూర్తి భిన్నంగా ఉండనున్నాయి. పైగా, ఈ లెఫ్టాండ్ సీమర్‌‌‌‌‌‌‌‌ వన్డే ఫార్మాట్‌‌‌‌లో ఇంకా నిలదొక్కుకోవాల్సి ఉంది.  మరోవైపు హెడ్ కోచ్ గంభీర్ సపోర్ట్‌‌‌‌తో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసి ఆకట్టుకున్న హర్షిత్‌‌‌‌కు ఇదే తొలి ఐసీసీ ఈవెంట్‌‌‌‌. ఇలాంటి టోర్నీల్లో పోటీ, ఒత్తిడి ఎలా ఉంటుందో తెలియదు.

ఇంగ్లండ్‌‌‌‌తో వన్డే సిరీస్‌‌‌‌లో మంచి పేస్‌‌‌‌తో పాటు వైవిధ్యం కూడా చూపెట్టిన ఈ కుర్రాడు అవసరం అయితేనే తుది జట్టులోకి రానున్నాడు. పేస్ ఆల్‌‌‌‌రౌండర్ కోటాలో తుది జట్టులో హార్దిక్ పాండ్యా కీలకం కానున్నాడు. కానీ, అతను పది ఓవర్ల కోటా బౌలింగ్‌‌‌‌ చేయకపోతే మాత్రం మిగతా పేసర్లు ముఖ్యంగా షమీపై ఒత్తిడి పెరగనుంది.  పైగా, తన సుదీర్ఘ కెరీర్‌‌‌‌‌‌‌‌లో మేటి బౌలర్‌‌‌‌‌‌‌‌గా ఎదిగి ఎన్నో విజయాల్లో భాగమైన మహ్మద్ షమీ ఇప్పటిదాకా ఒక్క ఐసీసీ ట్రోఫీని గెలుచుకోలేకపోయాడు. మరి, గత వన్డే వరల్డ్ కప్‌‌‌‌ మాదిరిగా స్వింగ్‌‌‌‌తో మ్యాజిక్ చేసి కప్పు కలను నిజం చేసుకుంటాడేమో చూడాలి.