భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. ఆమెపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే సందర్భంగా కౌర్ తన బ్యాట్‌తో స్టంప్స్‌ను పడగొట్టి, అంపైర్ తన్వీర్ అహ్మద్‌ను దూషిస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యలకు గానూ హర్మన్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించగా.. డిసిప్లినరి రికార్డులో 3 డిమెరిట్ పాయింట్లు విధించింది. అలాగే, మ్యాచ్ ముగిసిన అనంతరం అంపైర్‌ను బహిరంగంగా విమర్శించినందుకు ఆమె మ్యాచ్ ఫీజులో మరో 25 శాతం కోతతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ విధించినట్లు వెల్లడించింది.
Harmanpreet Kaur has been reprimanded for a breach of the ICC Code of Conduct during the third #BANvIND ODI ?https://t.co/3AYoTq1hV3
— ICC (@ICC) July 25, 2023
కీలక మ్యాచ్‌లకు దూరం కానున్న హర్మన్ ప్రీత్
హర్మన్ ప్రీత్ ఖాతాలో4 డిమెరిట్ పాయింట్లు చేరడంతో ఒక టెస్టు మ్యాచ్ లేదంటే.. రెండు వన్డేలు లేదా రెండు టీ20లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. అయితే భారత మహిళా జట్టు తదుపరి ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. దీంతో ఆమె భారత్ ఆడే తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరం అవుతుంది. ఆ లెక్కన.. హర్మన్ ప్రీత్ ఆసియా క్రీడల్లో నాకౌట్ మ్యాచ్‌లకు దూరం కానుంది. ఒక వేళ భారత జట్టు ఫైనల్ చేరితే అప్పుడు బరిలోకి దిగొచ్చు.
కాగా ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం ఆసియాలో టాప్ ప్లేసులో ఉన్న భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.