వరల్డ్ కప్ మొదటి సెమీ ఫైనల్లో టీమిండియాతో న్యూజిలాండ్ తలపడనుంది. ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ రేపు(నవంబర్ 15) జరగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలుస్తుందో అందరూ అంచనా వేసుకోవడం మొదలు పెట్టేసారు. భారత్ గెలుస్తుందా.. న్యూజిలాండ్ గెలుస్తుందా అని లెక్కలు వేసుకుంటున్నారు. బలాబలాలు, రికార్డులు అన్ని తిరగేస్తున్నారు. అయితే ఈ మెగా సమరంలో ఒక్కోసారి వరుణుడు పైచేయి సాధించే అవకాశం ఉంది.
సెమీ ఫైనల్లో వర్షం పడితే పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు? ఈ ప్రశ్నలకు తాజాగా ఐసీసీ సమాధానం చెప్పేసింది. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లకు రిజర్వ్ డేను కేటాయిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోతే తరువాత రోజు మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ మ్యాచ్ మధ్యలో వర్షం అంతరాయం కలిగిస్తే అక్కడి నుంచే ఆ తర్వాత రోజు మ్యాచ్ ను కొనసాగిస్తారు. రెండో రోజు కూడా వర్షం అంతరాయం కలిగిస్తే కనీసం 20 ఓవర్ల ఆటను నిర్వహించే ప్రయత్నం చేస్తారు.
రెండు రోజులు వర్షం కారణంగా మ్యాచ్ వర్షార్పణం అయితే లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు ఉన్న జట్టు ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. దీని ప్రకారం భారత్, కివీస్ ల మ్యాచ్ వర్షం కారణంగా రద్ధయితే అగ్ర స్థానంలో ఉన్న భారత్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. మరో వైపు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్టుకు ఇలాగే జరిగితే సఫారీల జట్టు ఫైనల్ కు వెళ్తుంది. 2019 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్లో కివీస్ ఇన్నింగ్స్ తర్వాత వర్షం పడడంతో మ్యాచ్ ను తర్వాత రోజు కొనసాగించారు.ఈ మ్యాచ్ లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ALSO READ : Cricket World Cup 2023: విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్.. రోహిత్‌కు నో ఛాన్స్