పసికూన జట్టు చేతిలో ఓటమి.. వరల్డ్ కప్ 2023 నుంచి వెస్టిండీస్ ఔట్

పసికూన జట్టు చేతిలో ఓటమి.. వరల్డ్ కప్ 2023 నుంచి వెస్టిండీస్ ఔట్

వరల్డ్ కప్ 2023 టోర్నీలో వెస్టిండీస్ పోరాటం ముగిసింది. ఈ మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించేలేకపోయినా విండీస్.. జింబాబ్వే వేదికగా క్వాలిఫయర్ మ్యాచులు ఆడుతోంది. ఈ క్వాలిఫయర్ టోర్నీలో అగ్రస్థానంలో నిలిచి మెగా ఈవెంట్‌కు అర్థత సాధిస్తుందనుకుంటే.. అంతా తలకిందులయ్యింది. పసికూన జట్టైన స్కాట్లాండ్ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

లీగ్ దశలో ధాటిగా ఆడిన వెస్టిండీస్.. సూపర్ సిక్స్ స్టేజ్‌లో దాన్ని కొనసాగించలేకపోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో ఓటమిపాలై ప్రపంచ కప్ 2023లో ఆడే అర్హతను కోల్పోయింది. శనివారం స్కాట్లాండ్‌తో జరిగిన కీలక పోరులో విండీస్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న స్కాట్లాండ్.. వెస్టిండీస్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.స్కాటిష్ ఆల్‌రౌండర్ బ్రెండన్ మెక్‌ముల్లన్ తన తొలి మూడు ఓవర్లలోనే వెస్టిండీస్‌ ఓటమిని ఖరారుచేశాడు. 

అతని ధాటికి జాన్సన్ చార్లెస్(0), బ్రూక్స్(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. కాసేపటికే బ్రెండన్ కింగ్(22), షాయ్ హోప్(13) కూడా వెనుదిరగడంతో 30 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం జాసన్ హోల్డర్(45), రొమారియో షెపర్డ్(36) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 77 పరుగుల జోడించడంతో విండీస్‌ కోలుకున్నట్లే కనిపించింది. అయితే వీరిద్దరూ ఔట్ అయ్యాక 181 పరుగులకే కుప్పకూలింది. 

అనంతరం 182 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన స్కాట్లాండ్.. ఆడుతూ పాడుతూ టార్గెట్ ను ఛేదించింది. మాథ్యూ క్రాస్(74) పరుగులతో రాణించగా.. మెక్‌ముల్లన్(69) బ్యాటింగ్‌లోనూ ఇరగదీశాడు. విశేషమేమిటంటే.. వెస్టిండీస్‌పై వన్డే క్రికెట్‌లో స్కాట్లాండ్ జట్టుకు ఇదే తొలి విజయం.