- అఫ్గాన్ పై 3 వికెట్ల తేడాతో ఉత్కంఠ గెలుపు
- హ్యాట్రిక్ విజయంతో సెమీస్ ఆశలు సజీవం
లీడ్స్: మెగా టోర్నీలో పాకిస్థాన్ జోరు కొనసాగుతుంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పసికూన అఫ్గానిస్థాన్‌పై గెలిచిన పాక్ టోర్నీలో విజయాల హ్యాట్రిక్ కొట్టింది. మొత్తం నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్–4లోకి చేరి సెమీఫైనల్ ఆశలను బలోపేతం చేసుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై మూడు వికెట్ల తేడాతో పాక్ గెలిచింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 227 రన్స్ చేసింది. అస్గర్ అఫ్గాన్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42), నజిబుల్లా జద్రాన్(54 బంతుల్లో 6 ఫోర్లతో 42) టాప్ స్కోరర్లు. పాక్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది(4/47) నాలుగు వికెట్లు తీయగా, వాహబ్ రియాజ్(2/29), ఇమాద్ వసీమ్ (2/48) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 49.4 ఓవర్లు ఆడిన పాక్ ఏడు వికెట్లు కోల్పోయి 230 రన్స్ చేసి గెలిచింది. ఇమాద్ వసీమ్(54 బంతుల్లో 5 ఫోర్లతో 49 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బాల్, బాట్‌తో రాణించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
ఇమాద్ పోరాటం..
ఉత్కంఠభరితంగా సాగిన ఛేజింగ్‌లో ఇమాద్ వసీమ్ పోరాటంతో పాక్ గట్టెక్కెంది. అసలు ఛేజింగ్‌లో పాక్‌కు మంచి ఆరంభమే దొరకలేదు. ముజీబుర్ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతికి ఓపెనర్ ఫఖర్ జమాన్(0) ఎల్బీ అయ్యాడు. దీనికి రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. ఇమాముల్ హక్(36), బాబర్ ఆజమ్(45) జాగ్రత్తగా ఆడి రెండో వికెట్‌కు 72 రన్స్ కీలక భాగస్వామ్యం నమోదు చేసి గెలుపు బాట వేశారు. అయితే వరుస ఓవర్లలో వీరిద్దరినీ పెవిలియన్ చేర్చిన నబీ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆపై, 30వ ఓవర్‌లో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన ముజీబుర్.. మహ్మద్ హఫీజ్(19)ను ఔట్ చేసి పాక్‌కు ఇంకో షాకిచ్చాడు. కాసేపటికే హారిస్ సోహైల్(27)ను రషీద్ వెనక్కుపంపడంతో చేయడంతో పాక్ ఒత్తిడిలోకి వెళ్లింది. ఆపై, సర్ఫరాజ్(18) రనౌటవడంతో అఫ్గాన్ విజయం సాధించేలా కనిపించింది. కానీ, కీలక సమయంలో అఫ్గాన్ ఆటగాళ్లు ఒత్తిడికి గురయ్యారు. ఓ క్యాచ్‌ను, రనౌట్ చాన్స్‌ను మిస్ చేశారు. వీటిని సద్వినియోగం చేసుకుంటూ షాదాబ్ ఖాన్(11), వాహబ్ రియాజ్(15 నాటౌట్) సహకారంతో ఇమాద్ వసీమ్ పాక్‌ను గెలిపించాడు.
షాహీన్ షో..
టోర్నీలో తొలి విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్‌ను బ్యాటింగ్ వైఫ్యలం మరోసారి దెబ్బకొట్టింది. బలమైన పాక్ బౌలింగ్ అటాక్‌ను ఎదుర్కొని పూర్తి కోటా ఓవర్లు ఆడినా సరే ఓ మాదిరి స్కోరే చేయగలిగింది. పాక్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది నాలుగు వికెట్లకు తోడు మిగిలిన బౌలర్లు కూడా సత్తా చాటడంతో అఫ్గాన్ ఇన్నింగ్స్ చప్పగా సాగింది. నజిబుల్లా, అస్గర్ మాత్రమే కాస్త పోరాడారు. ఫస్ట్ స్పెల్‌లో కెప్టెన్ గుల్బదిన్(15), హష్మతుల్లా(0)ను వరుస బంతుల్లో ఔట్ చేసిన ఆఫ్రిది అఫ్గాన్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. కాసేపు పోరాడిన రహ్మత్ షాను 12వ ఓవర్‌లో ఇమాద్ ఔట్ చేయడంతో అఫ్గాన్‌కు మరో షాక్ తగిలింది. ఈ దశలో అస్గర్, వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ ఇక్రమ్(24) తో కలిసి 64 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టి దూకుడుగా ఆడుతున్న అస్గర్‌ను 26వ ఓవర్‌లో ఔట్ చేసిన షాదాబ్ ఈ జోడీని విడదీశాడు. కాసేపటికి ఇక్రమ్‌ను ఇమాద్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నజిబుల్లా మిగిలిన బ్యాట్స్‌మెన్‌తో కలిసి నెమ్మదిగా ఆడి జట్టు స్కోరును రెండు వందలు దాటించాడు. చివరికి45వ ఓవర్‌లో అఫ్రిది బౌలింగ్‌లో అతను బౌల్డ్ అయ్యాడు. నబీ(16) మరోసారి నిరాశపరచగా, షెన్వారీ(19 నాటౌట్) చివరిదాకా క్రీజులో నిలిచాడు.
సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్థాన్: 50 ఓవర్లలో 227/9 (అస్గర్ అఫ్గాన్ 42), నజిబుల్లా జద్రాన్42, షాహీన్ 4/47).
పాకిస్థాన్: 49.4 ఓవర్లలో 230/7 (ఇమాద్ వసీమ్49 నాటౌట్, ముజీబుర్ 2/34).