జింబాబ్వే వేదికగా వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో బరిలోకి దిగిన అమెరికా జట్టును చూస్తుంటే ఇండియా- 'ఏ' టీం అన్న అనుభూతి కలుగుతోంది. వెస్టిండీస్ తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఆరుగురు భారత క్రికెటర్లు ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నారు. ఆఖరికి అమెరికా క్రికెట్ టీం కెప్టెన్ కూడా భారత క్రికెటరే.
యూఎస్ఏ టీం కెప్టెన్ మోనాంక్ పటేల్ గుజరాత్‌తో జన్మించగా, ఆ జట్టు ఓపెనర్ సుశాంత్ మదోనీ మహారాష్ట్రలో జన్మించాడు. ఇక ఆ జట్టులో కీలక బ్యాటర్ అయిన సాయితేజ ముక్కమల్లి ఇండియన్ ఎన్ఆర్ఐ. వీరితో పాటు జాస్‌దీప్ సింగ్(పంజాబ్), సౌరభ్ నేత్రవాల్కర్ (ముంబాయి), ఉస్మాన్ రఫీక్ (పంజాబ్) అమెరికా తరఫున బరిలో దిగారు.
ఇక ఆ జట్టు పేసర్ కైల్ ఫిలిప్ ట్రినిడాడ్‌కు చెందిన వాడు కాగా, అరోన్ జోన్స్ బార్బడోస్‌కు చెందినవాడు. మరో క్రికెటర్ షాయాన్ జహంగీర్ కరాచీలో జన్మించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని దేశాల క్రికెటర్లను కలిపి ఒక జట్టుగా ఆడిస్తున్నారు.
ఇక ఆదివారం జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏపై వెస్టిండీస్ 39 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 297 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో అమెరికా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. గజానంద్ సింగ్ (101) సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు.