- టీ20 వరల్డ్‌కప్ సెమీస్,ఫైనల్‌కు రిజర్వ్ డే
- ఐసీసీ నిర్ణయం
దుబాయ్ : వన్డే, టీ20ల్లో ‘స్టాప్ క్లాక్’ రూల్‌ను ఐసీసీ తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ట్రయల్స్‌లో ఉన్న ఈ నిబంధనను టీ20 వరల్డ్ కప్ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనుంది. ఈ మేరకు ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో శుక్రవారం దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ రూల్ ప్రకారం.. బౌలింగ్ జట్టు ఒక ఓవర్ పూర్తయిన 60 సెకండ్లలో తర్వాతి ఓవర్‌ను ప్రారంభించాలి. అలా చేయకపోతే రెండుసార్లు స్లో ఓవర్ వార్నింగ్ ఇస్తారు.
మూడోసారి కూడా అలాగే జరిగితే బౌలింగ్ టీమ్‌కు 5 రన్స్ పెనాల్టీ విధిస్తారు. ఈ స్టాప్ క్లాక్ రూల్ వల్ల వన్డేల్లో దాదాపు 20 నిమిషాల సమయం ఆదా అవుతుందని ఐసీసీ వెల్లడించింది. ఈ రూల్‌ను అమలు చేసేందుకు థర్డ్ అంపైర్ పర్యవేక్షణలో గ్రౌండ్‌లో ఎలక్ట్రానిక్ క్లాక్‌ను ఉంచుతారు. ఇందులో కౌంట్‌డౌన్ 60 నుంచి మొదలై జీరోకు వస్తుంది. ఆ లోగా కొత్త ఓవర్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన అమల్లో కొన్ని మినహాయింపులను కూడా ఇచ్చింది.
ఓవర్ల మధ్య కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చినప్పుడు డ్రింక్స్ బ్రేక్స్, ఆన్ ఫీల్డ్ ట్రీట్‌మెంట్‌లో ఈ రూల్ వర్తించదు. ఫీల్డింగ్ టైమ్‌లో నియంత్రించలేని పరిస్థితులు ఎదురైతే ఈ రూల్‌ను యాక్టివేట్ చేయరు. ఇక టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్స్ (జూన్ 27), ఫైనల్స్ (జూన్ 29) మ్యాచ్‌లకు రిజర్వ్ డేలను కేటాయించారు.
నాకౌట్ మ్యాచ్‌ల ఫలితాన్ని తేల్చేందుకు రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 10 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. 2026 టీ20 వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ ప్రాసెస్‌కు కూడా ఐసీసీ ఆమోద ముద్ర వేసింది.