![Champions Trophy 2025: ఇండియా-పాకిస్థాన్ సమరం..మ్యాచ్ అఫీషియల్స్‌ను ప్రకటించిన ఐసీసీ](https://static.v6velugu.com/uploads/2025/02/icc-finalised-the-match-officials-for-the-game-for-champions-trophy-2025_ZzucPQXNgL.jpg)
ఐసీసీ టోర్నీ జరుగుతుందంటే టీమిండియా ఫ్యాన్స్ దృష్టాంతా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ పైనే ఉంటుంది. టోర్నీ గెలవకపోయినా పాక్ పై గెలిస్తే చాలు అనుకుంటారు. మరో 12 రోజుల్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా దాయాదుల మధ్య పోరు నెక్స్ట్ లెవల్లో ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. మరోసారి ఐసీసీ ఈవెంట్స్ లో అభిమానులను ఖుషీ చేయడానికి రెడీ అయిపోయాయి. ఫిబ్రవరి 23న దుబాయ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ తలపడుతుంది. తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధించిన అఫీషియల్స్‌ను ఐసీసీ ప్రకటించింది.
ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా పాల్ రీఫెల్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ వ్యవహరించనున్నారు. పాల్ రీఫెల్ అత్యంత అనుభవంతుడు. 2013లో ఐసీసీ అంపైర్ల ఎలైట్ ప్యానెల్‌లో ఈ ఆస్ట్రేలియన్ అంపైర్ చోటు సంపాదించాడు. రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఇంగ్లాండ్ కు చెందినవాడు. ఇతనికి కూడా అంతర్జాతీయ క్రికెట్ లో ఎంతో అనుభవం ఉంది. టీమిండియా 2023 ప్రపంచ కప్ ఫైనల్‌లో అంపైర్‌గా కూడా పనిచేశాడు. టీవీ అంపైర్ గా మైఖేల్ గౌఫ్ ఉంటారు. నాల్గవ అంపైర్‌గా ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్, మ్యాచ్ రిఫరీగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ బూన్ ఉంటారని ఐసీసీ తెలిపింది.
Also Read :- 49 బంతుల్లోనే 160 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే విధ్వంసకర ఇన్నింగ్స్
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌తో పాటు అన్ని గ్రూప్ దశల మ్యాచ్‌లకు ఐసీసీ మ్యాచ్ అధికారులను ప్రకటించింది. టోర్నమెంట్ లో భాగంగా ఫిబ్రవరి 19 న పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగే టోర్నమెంట్ తొలి మ్యాచ్ కు రిచర్డ్ కెటిల్‌బరో, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు.. అంటే 19 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా ఆతిథ్య పాకిస్థాన్ జట్టు.. ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో భారత జట్టు.. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తమ మొదటి మ్యాచ్ ఆడుతుంది.