Niroshan Dickwella: నిర్దోషి అని నిరూపించుకున్నాడు: శ్రీలంక క్రికెటర్‌పై నిషేధం ఎత్తివేత

Niroshan Dickwella: నిర్దోషి అని నిరూపించుకున్నాడు: శ్రీలంక క్రికెటర్‌పై నిషేధం ఎత్తివేత

2024 లంక ప్రీమియర్ లీగ్ లో డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాడనే ఆరోపణలపై శ్రీలంక బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లాను ఆ దేశ క్రికెట్‌ బోర్డు సస్పెన్షన్ వేటు వేసింది. లంక ప్రీమియర్ లీగ్‌లో ప్రపంచ డోపింగ్ నిరోధక మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగిన పరీక్షలో డిక్వెల్లా విఫలమయ్యాడని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ అతను అన్ని రకాల క్రికెట్‌ల నుండి సస్పెండ్ చేయబడతాడని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. మూడేళ్లు అతనిపై నిషేధం విధించారు.  

నిషేధం తర్వాత శ్రీలంక బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా అన్ని రకాల క్రికెట్ ఆడేందుకు అనుమతి పొందాడు. అతడిపై గురువారం (డిసెంబర్ 12) ఐసీసీ నిషేధాన్ని ఎత్తివేసింది. డిక్వెల్లా తన నిషేధాన్ని అప్పీల్ చేసి, సంబంధిత సాక్ష్యాలను సమర్పించి తాను నిర్దోషి అని నిరూపించుకున్నాడు. మ్యాచ్ సమయంలో నిషేధించబడిన పదార్ధాలు ఏవీ వినియోగించబడలేదని సంబంధిత సాక్ష్యాలను సమర్పించినట్లు ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసినట్టు తెలుస్తుంది. 31 ఏళ్ల డిక్వెల్లా చివరిసారిగా 2023 మార్చిలో శ్రీలంక తరపున ఆడాడు. క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో స్థానం సంపాదించాడు. 

లంక ప్రీమియర్ లీగ్‌లో కెప్టెన్.. 

డిక్వెల్లా ఇటీవల ముగిసిన లంక ప్రీమియర్ లీగ్‌(LPL 2024)లో గాలే మార్వెల్స్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతని నాయకత్వంలో, గాలే జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి.. ఫైనల్ వరకూ చేరింది. అయితే, తుది పోరులో జఫ్నా చేతిలో పరాజయం పాలైంది. 31 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. లంక జట్టుకు మూడు ఫార్మాట్లలోనూ వికెట్ కీపర్‌గా పనిచేశాడు. టెస్టుల్లో 2757, వన్డేల్లో 1604, టీ20ల్లో 480 పరుగులు చేశాడు.