Cricket : ఐసీసీ కొత్త రూల్..ఇకపై అలా చేస్తే 5 పరుగుల పెనాల్టీ

Cricket : ఐసీసీ కొత్త రూల్..ఇకపై అలా చేస్తే 5 పరుగుల పెనాల్టీ

వన్డే, టీ 20 లు ఇటీవలే కాలంలో ఆలస్యంగా ముగుస్తున్నాయి. స్లో ఓవర్ రేట్ కింద ఆటగాళ్లకు జరిమానా విధించినా జట్లన్నీ తేలికగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చివరి ఓవర్లలో బ్యాటింగ్ టీంను కట్టడి చేయడానికి బౌలింగ్ జట్టు ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఓవర్ల మధ్యలో ఇలా ఎక్కువ సమయం వృధా చేయడం వలన అంతర్జాతీయ క్రికెట్ కూడా ఒక గల్లీ క్రికెట్ లా మారిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తాజాగా ఐసీసీ ఒక కొత్త రూల్ అమలులోకి తీసుకురానుంది. 
     
అంతర్జాతీయ క్రికెట్‌లో ఐసీసీ మరో కొత్త రూల్ కు శ్రీకారం చుట్టింది.  బౌలింగ్ జట్టు ఓవర్ల మధ్య తీసుకునే సమయాన్ని నియంత్రించేందుకు ఓ రూల్ తీసుకొచ్చింది. కొత్త రూల్ ప్రకారం బౌలింగ్ జట్టు 60 సెకన్‌లలోపు అంటే ఒక నిమిషం కన్నా ఎక్కువ సమయం తీసుకోకూడదు. ఒకవేళ మ్యాచ్‌లో రెండు సార్ల కంటే ఈ సమయం ఎక్కువగా ఉంటే బౌలింగ్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. కొత్త నిబంధన ప్రకారం బౌలింగ్ జట్టు 60 సెకన్‌లలోపు ఓవర్ వేయడానికి సిద్ధంగా ఉండాలి.

సాధారణంగా మ్యాచ్ రసవత్తరంగా మారినప్పుడు కెప్టెన్, బౌలర్ ఫీల్డింగ్ సెట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఈ  సమయంలో బ్యాటింగ్ చేసే జట్టుకు 5 పరుగులు అదనంగా వచ్చాయంటే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. అంతేకాకుండా ఇకపై మ్యాచ్‌లో ఓవర్ల మధ్య సమయాన్ని తనిఖీ చేయడానికి మ్యాచ్ అధికారులు దగ్గర స్టాప్ క్లాక్ ఉంటుంది. ఈ కొత్త రూల్ డిసెంబర్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఐసీసీ ప్రకటించింది. అయితే ఈ రూల్ టెస్టులకు లేదు. 

ALSO READ : అలా జరిగుంటే టీమిండియా వరల్డ్ కప్ గెలిచుండేది : అఖిలేష్ యాదవ్