ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. టాప్ 10 లో మనోళ్లే ముగ్గురు ఉండడం విశేషం. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో సూర్య కుమార్ యాదవ్ 797 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (743) నాలుగు ప్లేస్‌లు మెరుగుపడి ఆరో ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ ఆడకపోయినా జింబాబ్వేతో జరిగిన సిరీస్ లో జైస్వాల్ సూపర్ ఫామ్ తో అదరగొట్టాడు.
తొలి రెండు మ్యాచ్ ల్లో అందుబాటులో లేకపోయినా తర్వాత జరిగిన మూడు మ్యాచ్ ల్లో 141 పరుగులు చేశాడు. అతని యావరేజ్ 70 ఉంటే స్ట్రైక్ రేట్ 165.88 గా ఉంది. ఏడో స్థానంలో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ (684) 8వ ర్యాంక్‌కు పడిపోయాడు. 844 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కొనసాగుతున్నాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (533).. ఏకంగా 36 స్థానాలు ఎగబాకి 37వ స్థానంలో చోటు సంపాదించాడు.
బౌలింగ్‌లో ఇండియా నుంచి ఒక్కరికి కూడా టాప్–10లో చోటు దక్కలేదు. 12 వ స్థానంలో ఉన్న అక్షర్ పటేల్ ఒక స్థానం దిగజారి 13వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఆల్‌రౌండర్స్ లిస్ట్‌లో హార్దిక్ పాండ్యా నాలుగు ప్లేస్‌లు దిగజారి ఆరో ర్యాంక్‌లో, అక్షర్ 13వ ర్యాంక్‌ను సాధించారు. సుందర్ 41, శివం దూబే 43వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. శ్రీలంక బౌలింగ్ ఆల్ రౌండర్ హసరంగా అగ్ర స్థానంలో ఉన్నాడు.