- ఎక్కువ పచ్చిక..పెద్ద బౌండరీలు
ముంబై: ఇండియా 12 ఏండ్ల తర్వాత ఆతిథ్యం ఇస్తున్న వన్డే వరల్డ్‌కప్‌కు సమయం దగ్గరపడుతోంది. మెగా ఈవెంట్‌ను సక్సెస్ చేసేందుకు అటు ఐసీసీ, ఇటు బీసీసీఐ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఇండియాలోని పది వేదికల్లో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే, ఆ సమయంలో రాత్రి పూట కురిసే మంచు మ్యాచ్‌లను ప్రభావితం చేయనుంది.
2021లో యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో కూడా మంచు ప్రభావం చూపెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే జట్లకు చాలా అడ్వాంటేజ్ లభించింది. టాస్ నెగ్గిన జట్లు ఛేజింగ్ ఎంచుకొని అనుకున్న ఫలితం రాబట్టాయి. ఈ నేపథ్యంలో ఆటలో మంచు, టాస్ ప్రభావం తగ్గించి బ్యాట్, బాల్‌కు సమాన పోటీ ఉండేలా ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అన్ని స్టేడియాల్లో పిచ్‌లపై ఎక్కువ పచ్చిక ఉంచాలని క్యురేటర్లను ఆదేశించింది.
అలాగే బౌండరీ సైజులు 70 మీటర్లకు తగ్గకుండా చూడాలని, ఔట్‌ఫీల్డ్‌లో మంచు వల్ల ఏర్పడే తేమ త్వరగా తొలగిపోయేందుకు తాము నిర్దేశించిన వెట్టింగ్ ఏజెంట్ (కెమికల్)ను మాత్రమే వాడాలని సూచించింది.
సీమర్ల ప్రభావం కూడా
ఇండియాలో పిచ్‌లు సహజంగానే స్పిన్‌కు అనుకూలిస్తాయి. ఇప్పుడు ఎక్కువ పచ్చిక ఉంచాలన్న ఐసీసీ నిర్ణయంతో సీమర్లు కూడా ప్రభావం చూపనున్నారు. ఇక, బౌండరీ లైన్ సైజ్ పెంచడంతో బ్యాట్‌కు బాల్‌కు మధ్య సమతూకం ఏర్పడనుంది. ‘వరల్డ్‌కప్ జరిగే టైమ్‌లో ఇండియాలో మంచు కురుస్తుంది. చెన్నై, బెంగళూరులో వర్షాలు కూడా పడే చాన్సుంది.
మంచు స్పిన్నర్ల పెర్ఫామెన్స్‌పై చాలా ప్రభావం చూపిస్తుంది. వికెట్లపై ఎక్కువ పచ్చిక ఉంటే జట్లు స్పిన్నర్లపై ఎక్కువ ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో బౌండరీ సైజ్‌లు మినిమం 65 మీటర్లు, మ్యాగ్జిమమ్ 85 మీటర్లు ఉంటాయి.
ఇండియాలో పాత స్టేడియాల బౌండరీ సైజులు 70–75 మీటర్ల మధ్యలో ఉన్నాయి. వరల్డ్‌కప్ కోసం ప్రతీ స్టేడియంలో బౌండరీ సైజ్ 70 మీటర్లకు పైనే ఉండాలని ఐసీసీ సూచించింది’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా, టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో టర్నింగ్ వికెట్లపై ఆడేందుకు మొగ్గు చూపింది. అక్టోబర్ 8న చెన్నైలో జరిగే మ్యాచ్‌లో మంచు పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేకపోయినా.. అక్టోబర్ 29న ఇంగ్లండ్‌తో లక్నో వేదికగా జరిగే మ్యాచ్ క్యురేటర్లకు సవాల్ విసరనుంది.
హైదరాబాద్ చేరిన ట్రోఫీ
వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ హైదరాబాద్‌కు చేరుకుంది. ‘ట్రోఫీ టూర్2023’లో భాగంగా వరల్డ్ కప్‌ను ఐసీసీ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు తీసుకెళ్లి అభిమానులు నేరుగా చూసే అవకాశం కల్పించింది. జులై 1న ఇండియాలో మొదలైన ఈ టూర్ వివిధ దేశాలను చుట్టొచ్చి ఈ నెల 4న తిరిగి ఆతిథ్య దేశానికి చేరుకుంది. అప్పటి నుంచి దేశంలోని పలు నగరాలకు ట్రోఫీని తీసుకెళ్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం ట్రోఫీ హైదరాబాద్‌కు వచ్చింది. ముందుగా ఇనార్బిటాల్ మాల్‌లో ప్రదర్శనకు ఉంచారు. అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకెళ్లారు. గురువారం ఈ ట్రోఫీ ఉప్పల్ స్టేడియంలో ప్రదర్శనకు ఉంచు తారు. సిటీకి చెందిన పలువురు మాజీ క్రికెటర్లు ఈ ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశం ఉంది.
వరల్డ్ కప్ సాంగ్... ఇండియా జెర్సీ వచ్చేశాయి..
వన్డే వరల్డ్‌కప్ అధికారిక పాటను ఐసీసీ బుధవారం రిలీజ్ చేసింది. ‘దిల్ జషన్ బోలే’ పేరిట రూపొందించిన ఈ మ్యూజిక్ వీడియోలో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్‌లో కనిపించాడు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ కంపోజ్ చేసిన పాటలో కొరియోగ్రాఫర్, స్పిన్నర్ చహల్ భార్య ధనశ్రీ కూడా రణ్‌వీర్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. మరోవైపు మెగా టోర్నీలో టీమిండియా ఉపయోగించే జెర్సీని బీసీసీఐ, కిట్ స్పాన్సర్ అయిన అడిడాస్ విడుదల చేశాయి.